సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు సాగిస్తున్న ఆందోళనకు సంఘీభావం తెలుపుతూ, పంజాబ్ ఎమ్మెల్యే నవజ్యోత్ సింగ్ సిద్ధూ పాటియాలా, అమృత్‌సర్‌లలో తన నివాసాలపై నల్ల జెండాలను ఎగురవేసారు. గత కొంతకాలంగా సమస్య పరిష్కారానికి కేంద్రం అనుసరిస్తున్న సాచివేత ధోరణికి నిరసనగా నల్లజెండాను ఎగురవేద్దాం అంటూ అంతకుముందు ఓ ట్వీట్‌లో సిద్ధూ కోరారు.
మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయడం, కనీస మద్దతు ధరకు హామీ ఇస్తూ ప్రత్యామ్నాయం చూపించడం, రాష్ట్ర ప్రభుత్వం ద్వారా సేకరణకు భరోసా కల్పించడం చేయాలని ఆయన కేంద్రాన్ని డిమాండ్ చేశారు. అంతవరకూ రైతులకు సంఘీభావం తెలుపుతూనే ఉంటామన్నారు.
కేంద్రం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని, గిట్టుబాటు ధరపై చట్టం తీసుకురావాలని ఢిల్లీ సరిహద్దుల్లో రైతు సంఘాలు గత ఏడాది నవంబర్ నుంచి ఆందోళనలు ప్రారంభించాయి. ఆందోళన చేపట్టి ఆరు నెలలు పూర్తవుతున్న సందర్భంగా 40 రైతు సంఘాలు 26 న బ్లాక్ డేకు పిలుపునిచ్చాయి. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు హరియాణలోని పలు జిల్లాల నుంచి పెద్దఎత్తున రైతులు ఢిల్లీ కి బయలు దేరారు. భారత్ కిసాన్ యూనియన్ నేత గుర్నామ్ సింగ్ నేతృత్వంలో వందలాది వాహనాల్లు రోడ్డెక్కాయి. ఈ బ్లాక్ డేకు ఇప్పటికే దేశంలో పలు పార్టీలు మద్దతు ప్రకటించాయి.