వంటగ్యాస్‍‍పై మరో రూ. 25 బాదుడు.. పెరిగిన ధర నేటినుండే అమల్లోకి..

Natural Gas Price Forecast. చమురు కంపెనీలు గురువారం వంటగ్యాస్‌పై రూ.25 పెంచాయి.

By Medi Samrat  Published on  25 Feb 2021 3:08 AM GMT
Natural Gas Price Forecast

దేశంలో వంట గ్యాస్ ధర మ‌రోసారి పెరిగింది. నిన్న‌టివ‌ర‌కూ పెట్రోల్‌, డీజిల్‌ ధరలను పెంచుతూ వచ్చిన చమురు కంపెనీలు గురువారం వంటగ్యాస్‌పై రూ.25 పెంచాయి. పెరిగిన ధరలు నేటినుండే అమల్లోకి రానున్న‌ట్లు తెలిపాయి. దీంతో ఢిల్లీలో సిలిండ‌ర్‌‌ ధర రూ.794కు చేరింది. ఇప్ప‌టికే ఫిబ్రవరి నెలలో రెండుసార్లు పెరిగిన సిలిండ‌ర్ ధ‌ర‌.. తాజాగా మూడోసారి పెర‌గ‌డం గమనార్హం.


సాధారణంగా గ్యాస్ సిలిండర్ ధరలు నెలకు ఒకసారి మారుతూ ఉంటాయి. ఒక్క ఫిబ్రవరి నెలలో నెల‌లో మూడుసార్లు పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్ రేట్లను అనుగుణంగా ఆయిల్ కంపెనీలు సిలిండర్ ధరను మారుస్తూ వస్తాయి. మొద‌ట‌గా పిబ్ర‌వ‌రి 4న సిలిండర్‌పై రూ.25 పెంచగా.. రెండ‌వ‌సారి 15న తేదీన మరో రూ.50లు పెంచాయి. ఒక్క‌నెల‌లోనే మూడుసార్లు పెంచి సామాన్యుడికి సిలిండర్‌పై రూ.100 అద‌నపు భారం చేశాయి‌. గత ఏడాది డిసెంబర్‌లోనూ చ‌మురు కంపెనీలు సిలిండ‌ర్ ధ‌ర‌ల‌ను రెండు సార్లు పెంచాయి. పెరిగిన ధరలతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఇదిలావుంటే.. వరుసగా 12 రోజులపాటు పెరిగిన పెట్రో ధరలు తాజాగా బుధవారం కూడా పెరిగాయి. దేశీయ చమురు సంస్థలు లీటర్‌ పెట్రోల్‌, డీజిల్‌పై 38పైసల మేరకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. రెండురోజుల పాటు స్థిరంగా కొనసాగిన పెట్రోధరలు.. బుధ‌వారం మళ్లీ పెరగడంతో వాహనదారులు లబోదిబోమంటున్నారు.

పెరిగిన ధ‌ర‌ల‌తో దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్‌, డీజిల్‌పై 35పైసలు పెంచడంతో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.90.93 కి చేరగా.. డీజిల్‌ ధర రూ.81.32గా నమోదైంది. ఆర్థిక రాజధాని ముంబయిలో పెట్రోల్ ధర రూ.97.34కి చేరగా.. డీజిల్ ధర రూ.88.44 కిచేరింది. బెంగళూరులో పెట్రోల్ ధర రూ.93.98 ఉండగా.. డీజిల్ రూ.86.21కి పెరిగింది. హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌పై 36పైసలు, డీజిల్‌పై 38పైసలు పెంచాయి. దీంతో హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.94.54, డీజిల్‌ ధర రూ.88.69కి చేరింది.

Next Story
Share it