జాతీయ చిహ్నం వివాదం.. వాళ్లు చెప్పిన డిజైన్లే చేశానన్న శిల్పి
National emblem controversy.. What does the sculptor say?. సారనాథ్‌లోని అశోక స్తంభం, పార్లమెంటు కొత్త భవనంపై ఏర్పాటు చేసిన జాతీయ చిహ్నం రూపు రేఖలలో చాలా తేడాలు
By అంజి Published on 13 July 2022 11:33 AM ISTసారనాథ్‌లోని అశోక స్తంభం, పార్లమెంటు కొత్త భవనంపై ఏర్పాటు చేసిన జాతీయ చిహ్నం రూపు రేఖలలో చాలా తేడాలు ఉన్నాయని ప్రతిపక్షాల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయితే పార్లమెంటు కొత్త భవనంపై ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించిన జాతీయ చిహ్నం సారనాథ్‌లో ఉన్న దానికి ప్రతిరూపమని, రాజకీయ కారణాలతో ప్రతిపక్షాలు ఉద్దేశపూర్వకంగా ఒకదాని తర్వాత మరొకటి వివాదాన్ని సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నాయని బీజేపీ ఆరోపించింది.
జాతీయ చిహ్నంపై విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో నిర్మాణ రూపశిల్పి స్పందించారు. జాతీయ చిహ్నానికి సంబంధించి ఇచ్చిన డిజైన్లలో ఎలాంటి మార్పులు చేయలేదని చెప్పారు. టాటా కంపెనీ మట్టి నమూనాను చేసి ఇచ్చిందని, దానికి అనుగుణంగానే జైపూర్‌లో తాము కాంస్య విగ్రహం తయారు చేశామని నిర్మాణ రూపశిల్పి లక్ష్మణ్ వ్యాస్ తెలిపారు. చిహ్నాన్ని ఇటాలియన్ మైనపు పద్ధతిలో డిజైన్ చేశామని, డిజైన్లలో తాను మార్పులేవీ చేయలేదని స్పష్టం చేశారు.
సారనాథ్‌లోని అశోక స్తంభం, పార్లమెంటు కొత్త భవనంపై ఏర్పాటు చేసిన జాతీయ చిహ్నం రూపు రేఖలపై తీవ్ర దుమారం చెలరేగింది. తాజా చిహ్నాం నిర్మాణంలో చాలా తేడాలు ఉన్నాయని కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ సహా పలు ప్రతిపక్ష పార్టీ నేతలు మండిపడ్డారు. నెట్టింట పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించారు. తాజా నిర్మాణంలో అవసరమైన మార్పులు తక్షణమే చేయాలని డిమాండ్ చేశారు. సారనాథ్ స్తూపంలోని సింహాలు ఆకర్షణీయంగా, గంభీర వదనాన్ని కలిగి ఉండగా.. మోదీ ఆవిష్కరించిన జాతీయ చిహ్నంలోని మృగరాజులు రౌద్రంగా కోరలు చాచి క్రూరంగా కనిపిస్తున్నాయని ప్రతిపక్షాలు ఆరోపించాయి.
అశోక స్తంభంలోని రూపాలను మార్చడమంటే జాతీయ చిహ్నాన్ని అవమానించడమేనని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ ట్విటర్‌లో పేర్కొన్నారు. తాజా నిర్మాణం చూస్తే 'సత్యమేవ జయతే నుంచి సింహమేవ జయతే'లా పరిస్థితులు మారినట్లు కనిపిస్తున్నాయని టీఎంసీ నేత మహువా సెటైర్ వేశారు. అయితే ప్రతిపక్షాల విమర్శలను బీజేపీ ఖండిచింది. సారనాథ్ స్తూపం తరహాలోనే పార్లమెంటుపై జాతీయ చిహ్నం ఉందని పార్టీ ప్రధాన అధికార ప్రతినిధి అనిల్ బలూని పేర్కొన్నారు.