భారత్‌లో కరోనా సెకండ్ వేవ్ ఉద్దృతి ఇంకా తగ్గనేలేదు. కరోనా నుంచి కోలుకోకముందే ఫంగస్ కేసులు ప్రజలను వెంటాడుతున్నాయి. ఇప్పటికే బ్లాక్, వైట్, ఎల్లో ఫంగస్ కేసులను గుర్తించారు. ఇటీవల బ్లాక్ ఫంగస్ కేసులు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఇవి చాలదు అన్నట్లు ఇప్పుడు మరో కొత్త రకం ఫంగస్ ఇన్ఫెక్షన్ వచ్చి చేరింది. అదే నాసల్ ఆస్పెర్‌గిలోసిస్. గుజరాత్ రాష్ట్రంలో 8 మందిలో ఈ వైరస్ గుర్తించారు. గోత్రి ఎస్ఎస్‌జి వైద్య కళాశాలకు అనుబంధంగా పని చేసే రెండు ప్రభుత్వాసుపత్రిలో 262 మంది బ్లాక్‌ఫంగస్ తో చికిత్స పొందుతుడగా వారిలో 8 మందికి ఆస్పెర్‌గిలోసిస్ లక్షణాలు బయటపడ్డాయి.
ఇది చాలా అరుదైన ఫంగల్ ఇన్ఫెక్షన్ అని.. కరోనా నుంచి కోలుకున్న లేదా చికిత్స పొందుతున్న రోగుల్లో వచ్చే అవకాశం ఉందని డాక్టర్ షీటల్ మిస్త్రీ తెలిపారు. ఆస్పెర్‌గిలోసిస్ ఇన్ఫెక్షన్ ముకోర్‌మైకోసిస్ వలె మ్యుటిలేటింగ్ ఇన్ఫెక్షన్ కానప్పటికీ, ఇది ఇన్వాసివ్ ఇన్ఫెక్షన్గా చెప్పవచ్చునని.. ఇప్పుడు బయటపడుతున్న ఫంగల్ ఇన్ఫెక్షన్లు రినో-ఆర్బిటల్- సెరిబ్రల్ పాసేజ్‌లోనే ఎక్కువగా ఉంటాయి. అందుకే దీన్నిఅరుదైన ఇన్ఫెక్షన్గా భావిస్తున్నామన్నారు.
ఇది ఎక్కువగా డయాబెటిస్ ఉన్న రోగులకు, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారికి సోకుతుందన్నారు. రక్తంలో తక్కువ లింఫోసైట్లు (లింఫోపెనియా) ఉన్నవారిలో కూడాలో ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ల ప్రమాదం ఎక్కువని డాక్టర్లు చెబుతున్నారు. ప్రారంభంలోనే దీన్ని గుర్తించి చికిత్స తీసుకోవాలని లేదంటే.. ప్రాణాలకే ప్రమాదమన్నారు.