చాప‌కింద నీరులా ఒమిక్రాన్‌.. దేశంలో 37కు పెరిగిన కేసులు

Nagpur reports first case of Omicron variant Country's Tally Rises To 37.దేశంలో క‌రోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ చాప‌కింద

By తోట‌ వంశీ కుమార్‌  Published on  12 Dec 2021 5:57 PM IST
చాప‌కింద నీరులా ఒమిక్రాన్‌.. దేశంలో 37కు పెరిగిన కేసులు

దేశంలో క‌రోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ చాప‌కింద నీరులా వ్యాపిస్తోంది. ఇప్ప‌టికే అర‌వైకి పైగా దేశాల్లో ఒమిక్రాన్ వ్యాపించగా.. ఆదివారం ఒక్క రోజే దేశంలో నాలుగు పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. ఇప్పటికే చండీగఢ్‌, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటకలో కేసులు నమోదుకాగా.. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ఒకరికి పాజిటివ్‌గా తేలింది. దీంతో దేశంలో ఒమిక్రాన్ పాజిటివ్ కేసుల సంఖ్య 37కి చేరింది. ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క మ‌హారాష్ట్ర‌లోనే అత్య‌ధికంగా 18 కేసులు వెలుగు చూశాయి.

మ‌హారాష్ట్ర లోని నాగపూర్ పట్టణంలో తొలి కేసు నమోదైంది. పశ్చిమ ఆఫ్రికాలోని ఓ దేశం నుంచి వ‌చ్చిన 40 ఏళ్ల వ్య‌క్తిలో ఒమిక్రాన్ పాజిటివ్‌గా తేలింది. స్థానిక నివాసి అయిన ఆ వ్యక్తి ఎనిమిది రోజుల క్రితం పశ్చిమ ఆఫ్రికాలోని ఓ దేశం నుంచి వచ్చాడని.. ఆ తర్వాత అతనికి క‌రోనా పాజిటివ్‌ వచ్చిందని నాగ్‌పూర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (ఎన్‌ఎంసీ) కమిషనర్‌ రాధాకృష్ణన్‌ తెలిపారు.

క‌రోనా పాజిటివ్ రావ‌డంతో సిటీ ఆస్ప‌త్రిలో అడ్మిట్ అయ్యాడ‌ని.. అత‌డి శాంపిల్స్ సేక‌రించి జీనోమ్‌ సీక్వెన్సింగ్‌కు పంపగా.. ఇవాళ రిపోర్టుల్లో ఒమిక్రాన్‌ పాజిటివ్‌ నిర్ధారణ అయ్యిందని రాధాకృష‌న్ తెలిపారు. ప్రస్తుతం అతనికి వైద్యం అందిస్తున్నట్లు తెలిపారు. అతని కాంటాక్టులను గుర్తించి, పరీక్షలు చేయగా నెగెటివ్‌గా తేలినట్లు వెల్ల‌డించారు.

దేశంలో ఒమిక్రాన్ కేసులు మహారాష్ట్ర రాష్ట్రంలో 18, కర్ణాటకలో 3, రాజస్థాన్ 9, ఢిల్లీ 2, ఛండీగడ్ 1, గుజరాత్ 3, ఏపీ 1 న‌మోదు అయ్యాయి. ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండ‌డంతో కేంద్ర ప్రభుత్వం అప్ర‌మ‌త్తమైంది. అవ‌స‌రం అయితే.. రాత్రి క‌ర్ఫ్యూను అమ‌లు చేయాల‌ని రాష్ట్రాల‌కు కేంద్రం లేఖ‌లు రాసింది.

Next Story