కొత్త‌గా మూడు జిల్లాలు.. అమోదం తెలిపిన మంత్రివ‌ర్గం

Nagaland Creates Three New Districts. నాగాలాండ్ ప్రభుత్వం రాష్ట్రంలో మూడు కొత్త జిల్లాలను ఏర్పాటు చేసింది. గ‌త శనివారం

By Medi Samrat  Published on  21 Dec 2021 9:05 AM GMT
కొత్త‌గా మూడు జిల్లాలు.. అమోదం తెలిపిన మంత్రివ‌ర్గం

నాగాలాండ్ ప్రభుత్వం రాష్ట్రంలో మూడు కొత్త జిల్లాలను ఏర్పాటు చేసింది. గ‌త శనివారం రాష్ట్ర మంత్రివర్గం మూడు కొత్త జిల్లాల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి నీఫియు రియో ​​అధ్యక్షతన తాజాగా జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ మేర‌కు నిర్ణయం తీసుకున్నారు. దీంతో మొత్తం జిల్లాల సంఖ్య 15కి చేరనుంది. త్సెమిన్యు, నియులాండ్ మరియు చుముకెడిమా కేంద్రాలుగా మూడు కొత్త జిల్లాలను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ప్ర‌య‌త్నాలు మొద‌లెట్టింది. ప్రత్యేక త్సెమిన్యు జిల్లా కోసం ప్ర‌భుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు రెంగ్మా సంఘం ఇటీవల నిర‌స‌న కార్య‌క్ర‌మాలు చేప‌డుతున్న నేఫ‌థ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది ప్ర‌భుత్వం. త్సెమిన్యు సబ్‌డివిజన్‌ను నాగాలాండ్ గవర్నర్ తక్షణమే పూర్తి స్థాయి జిల్లాగా అప్‌గ్రేడ్ చేయడం పట్ల ప్ర‌జ‌లు సంతోషిస్తున్నారు. త్సెమిన్యు గ‌తంలో నాగాలాండ్‌లోని కోహిమా జిల్లాలో సబ్‌డివిజన్ గా ఉంది. తాజాగా నాగాలాండ్ ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్‌కు గ‌వ‌ర్న‌ర్ అమోదం తెల‌ప‌డంతో త్సెమిన్యు 13వ‌ జిల్లాగా అవ‌తరించింది.

నియులాండ్ సబ్‌డివిజన్‌ను కూడా త‌క్ష‌ణ‌మే పూర్తి స్థాయి జిల్లాగా అప్‌గ్రేడ్ చేయడానికి అమోదం తెలిపారు గ‌వ‌ర్న‌ర్‌. నియులాండ్ గ‌తంలో దిమాపూర్ జిల్లాలో సబ్‌డివిజన్. తాజా స‌వ‌ర‌ణ‌తో కొత్త జిల్లాగా ఏర్ప‌డింది. చుముకెడిమా కూడా దిమాపూర్ జిల్లాలోని భాగ‌మే. దీనిని కూడా జిల్లాగా ఏర్పాటు చేస్తున్నారు. ఇదిలావుంటే.. శామతోర్‌కు కూడా జిల్లా హోదా కల్పించేందుకు మంత్రివర్గం సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. అయితే, ఈ సబ్ డివిజన్‌లో నివసించే వివిధ తెగలు ఈ విషయమై అంగీకరిస్తేనే ప్రత్యేక జిల్లా (షామటోర్) ఏర్పాటు సాధ్యమవుతుందని తెలిపింది. అయితే.. ఒక తెగ నివసించే ప్రాంతాలను ప్రభుత్వం విభజించదని సమావేశంలో ముఖ్యమంత్రి తేల్చిచెప్పారని అధికార‌ వర్గాలు తెలిపాయి. మీడియా ప్రతినిధులతో మాట్లాడిన డిప్యూటీ సీఎం వై పాటన్.. కొత్త జిల్లాల ఏర్పాటు కోసం డిమాండ్లు ఉన్నప్పటికీ.. కేబినెట్ మూడింటిని మాత్రమే పరిగణలోకి తీసుకుందని తెలిపారు. ఇత‌ర‌ కొత్త జిల్లాల‌ డిమాండ్ ఉన్న‌చోట ఒకే తెగకు చెందిన గిరిజ‌నులు ఉన్నార‌ని తెలిపారు.


Next Story