గుజ‌రాత్‌లో మిస్ట‌రీగా మిగిలిన వింత కాంతి.. సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌

Mysterious Lights Sighted In Gujarat Sky.విశ్వంలో మ‌నం ఒంట‌రి వారం కాద‌నేది శాస్త్ర‌వేత్త‌ల వాద‌న‌. మ‌న పాల‌పుంత‌లో

By తోట‌ వంశీ కుమార్‌  Published on  23 Jun 2021 4:19 AM GMT
గుజ‌రాత్‌లో మిస్ట‌రీగా మిగిలిన వింత కాంతి.. సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌

విశ్వంలో మ‌నం ఒంట‌రి వారం కాద‌నేది శాస్త్ర‌వేత్త‌ల వాద‌న‌. మ‌న పాల‌పుంత‌లో మ‌న‌తో పాటు ఎంతో మంది ఉండేదేందుకు అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు. వారు మ‌న‌కంటే ఎంతో తెలివైన‌, చాలా ఆధునిక‌మైన టెక్నాల‌జీని క‌లిగి ఉన్నార‌నే అభిప్రాయం చాలా మందిలో ఉంది. వారి కోసం శాస్త్ర‌వేత్త‌లు ఎంతోకాలంగా అన్వేష‌ణ సాగిస్తున్నా.. ఇప్ప‌టి వ‌ర‌కు ఖ‌చ్చిత‌మైన ఆధారాలు అయితే.. ఏమీ దొర‌క‌లేదు. అయితే.. కొన్ని చోట్ల వింత సంఘ‌ట‌న‌లు జ‌రుగుతున్నాయి. వాటికి కార‌ణం ఖ‌చ్చితంగా ఏలియ‌న్సే అన్న అభిప్రాయం మాత్రం ప్ర‌జ‌ల్లో ఉంది. అయితే.. నిజం ఏమిట‌న్న‌ది ఇంత వ‌ర‌కు స‌రిగ్గా తెలియ‌దు. తాజాగా భార‌త్‌లో అటువంటి సంఘ‌ట‌న చోటు చేసుకుంది.

అది జున్ 21, 2021.. సోమ‌వారం రాత్రి స‌రిగ్గా 10 గంట‌ల స‌మ‌యం. గుజ‌రాత్‌లోని జునాగ‌ఢ్ న‌గ‌రంలో ఆకాశంలో వింత కాంతి క‌నిపించింది. ఆ కాంతి ఏమిట‌న్న‌ది అక్క‌డ ఉన్న ఎవ్వ‌రికి ఏమీ అర్థం కాలేదు. వెంట‌నే త‌మ ద‌గ్గ‌ర ఉన్న ఫోన్‌ల‌లో ఆ కాంతిని ఫోటోలు, వీడియోలు తీశారు. రంగురంగులుగా మెరుస్తూ క‌నిపించిన ఆ ఎగిరే వ‌స్తువును చూసేందుకు ప్ర‌జ‌లు ఇళ్ల‌లోంచి బ‌ట‌కి వ‌చ్చారు. 4 లైట్లతో ఉన్నట్లుగా కనిపించిన కాంతి.. ఆకాశంలో చక్కర్లు కొట్టింది. కొంద‌రు అది ఉల్క కావ‌చ్చ అని అభిప్రాయ ప‌డ‌గా.. మ‌రికొంద‌రు మాత్రం హెలికాఫ్ట‌ర్ కావ‌చ్చున‌ని అంటున్నారు. ఇంకొంద‌రు ఏమో అది యూఎఫ్‌వో అని అన్నారు. అది ఉల్క కాదనీ.. ఉల్కే అయితే అంతసేపు ఆకాశంలో స్థిరంగా ఉండదని తేల్చారు. తారా జువ్వ కూడా క్షణాల్లో కింద పడిపోతుంది కాబట్టి.. తారాజువ్వ కూడా కాదని భావిస్తున్నారు. ప్ర‌స్తుతం ఆ వింత‌కాంతి ఫోటోలు, వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.

కాగా.. దీనిపై గుజరాత్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (గుజ్‌కోస్ట్‌) సలహాదారు నరోత్తం సాహూ మాట్లాడుతూ.. ''అసహజమైన కాంతి దృశ్యాలను జనాలు యూఎఫ్‌ఓలుగా భావిస్తున్నారు. కానీ ఇది నిజం కాదు.. ఇవి శాటిలైట్‌లు. భూమికి తక్కువ ఎత్తులో పయనించే ఈ శాటిలైట్‌లు ఇలా కనిపించి జనాలను భయభ్రాంతులకు గురి చేశాయి తప్పి ఇవి యూఎఫ్‌ఓలు కాదు'' అన్నారు.

Next Story