ఆయన మరణం.. కుప్పకూలిన ముత్తూట్ ఫైనాన్స్ షేర్లు..!
Muthoot Finance Shares Drop After Chairman Reportedly Fell To Death In Delhi. సోమవారం నాడు బుల్ మార్కెట్‌లో ముత్తూట్ ఫైనాన్స్ షేర్లలో అమ్మకాల ఒత్తిడి నెలకొంది.
By Medi Samrat
ముత్తూట్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ మత్తయ్య జార్జ్ ముత్తూట్ (72) కన్నుమూశారు. శుక్రవారం రాత్రి ఢిల్లీలోని తన నివాసంలో మెట్లపై నుంచి జారి పడి మరణించినట్టు తెలుస్తోంది. ఎంజీ జార్జ్ ముత్తూట్ హఠాన్మరణంపై పలువురు దిగ్భాంతిని వ్యక్తం చేశారు. నాలుగో అంతస్తునుంచి పడి జార్జ్ ముతూట్ చనిపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు సీసీటీవీ ఫుటేట్‌ను పరిశీలిస్తున్నట్టు వెల్లడించారు.
మరోవైపు దీనిపై ఢిల్లీలోని ఎయిమ్స్ ఫోరెన్సిక్ విభాగం ముగ్గురు సీనియర్ వైద్యుల బోర్డును ఏర్పాటు చేసింది. ఈ కేసులో వారు అన్ని కోణాల్లోనూ పరిశీలిస్తున్నారని, ఎయిమ్స్ ప్రొఫెసర్, ఫోరెన్సిక్ మెడిసిన్ విభాగం అధిపతి డాక్టర్ సుధీర్ కుమార్ గుప్తా వెల్లడించారు. దేశంలోనే అతి పెద్ద బంగారు ఆభరణాల తనఖా రుణాలసంస్థగా పేరున్న ముత్తూట్ ఫైనాన్స్‌కు 5,000 బ్రాంచీలు ఉన్నాయి. 20కి పైగా వ్యాపారాలు, 550 శాఖలున్నాయి. ఫోర్బ్స్ ఆసియా మ్యాగజీన్ ఇండియా సంపన్నుల జాబితా ప్రకారం, 2011లో భారత్‌లో 50వ స్థానంలో ఉన్నారు. 2020 నాటికి ర్యాంకింగ్ మెరుగుపరచుకుని 500 కోట్ల డాలర్ల సంపదతో 44వ స్థానానికి చేరారు.
జార్జ్ ముత్తూట్ అనుమానాస్పద మరణం ఇన్వెస్టర్ల సెంటిమెంటును తీవ్రంగా ప్రభావితం చేసింది. సోమవారం నాడు బుల్ మార్కెట్‌లో ముత్తూట్ ఫైనాన్స్ షేర్లలో అమ్మకాల ఒత్తిడి నెలకొంది. ఆరంభంలోనే 6.57 శాతం క్షీణించి బీఎస్‌ఈలో 1205 రూపాయల ఇంట్రాడే కనిష్టానికి చేరుకున్నాయి. ప్రస్తుతం 3 శాతం వద్ద కొనసాగుతున్నాయి. సంస్థ పెద్ద మరణంతో ముత్తూట్ ఫైనాన్స్ లో తమ బంగారాన్ని తనఖా పెట్టి రుణం తీసుకున్న వినియోగదారుల్లో ఆందోళన నెలకొంది. జార్జ్ ముత్తూట్ అకాలమరణంపై విచారం వ్యక్తం చేసిన ముత్తూట్ ఫైనాన్స్ ఆయన నాయకత్వంలో సరికొత్త వృద్ధిని నమోదు చేసిందని, గోల్డ్ లోన్ ఇండస్ట్రీలో మార్కెట్ లీడర్ అయ్యిందని కంపెనీ శనివారం ఒక ప్రకటనలో తెలిపింది. ముత్తూట్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్టు తెలిపింది.