కరోనా మహమ్మారి కారణంగా ప్రముఖ సంగీత దర్శకుడు శ్రావణ్ రాథోడ్ (66) కరోనాతో మృతి చెందారు. సంగీత దర్శకుడు నదీమ్‌తో కలిసి శ్రావణ్ సంగీతాన్ని సమకూర్చేవారు. నదీమ్-శ్రావణ్ జంటగా బాలీవుడ్‌లో ఈ ద్వయం చిరపరిచితం. ఆషికి, సాజన్, పరదేశ్, రాజా హిందూస్థానీ వంటి అనేక చిత్రాలకు వీరే సంగీతాన్ని అందించారు. ఇటీవల శ్రావణ్ కు కరోనా సంక్రమించింది. ఆరోగ్యం క్షీణించడంతో ముంబైలోని ఎల్ఎల్ రహేజా ఆసుపత్రిలో చేరారు. అక్కడ చికిత్స తీసుకుంటున్న ఆయన ఆరోగ్యం మరింత క్షీణించడంతో తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆయన కుమారుడు సంజీవ్ వెల్లడించారు. శ్రావణ్ కుమారులైన సంజీవ్, దర్శన్ కూడా సంగీత దర్శకులుగానే స్థిరపడ్డారు. పలువురు బాలీవుడ్ ప్రముఖులు ఆయన మృతికి సంతాపం తెలిపారు.
శ్రవణ్ రాథోడ్ కు, ఆయన భార్యకు కూడా కరోనా పాజిటివ్ వచ్చింది. హరిద్వార్‌లోని కుంభమేళాకు హాజరయ్యారని స్వయంగా సంజీవ్ తెలిపారు. కుంభమేళా కరోనా హాట్ స్పాట్ గా మారిందంటూ పలు మీడియా సంస్థలు చెప్పిన సంగతి తెలిసిందే.. దేశంలో కరోనా కేసులు పెరిగిపోతూ ఉన్నా కూడా కుంభమేళా నిర్వహించారనే విమర్శలు కూడా వచ్చాయి. శ్రవణ్ రాథోడ్ కు కరోనా అక్కడే సోకింది. తమ కుటుంబం ఇంత ఘోరమైన పరిస్థితిల్లో కూరుకుపోతుందని తాము ఎప్పుడూ అనుకోలేదని..తాను, అమ్మ, సోదరుడు కూడా ప్రస్తుతం కరోనాతో బాధపడుతున్నా మంటూ ఆయన వాపోయారు సంజీవ్. హోం ఐసోలేషన్‌లో ఉన్న సోదరుడు తన తండ్రి అంత్యక్రియలు చేసేందుకు అనుమతి తీసుకున్నట్టు వెల్లడించారు. హాస్పిటల్ యాజమాన్యం బిల్లింగ్ సమస్య కారణంగా శ్రవణ్ మృత దేహాన్ని ఇవ్వకుండా ఇబ్బంది పెట్టిందన్న పుకార్లను సంజీవ్ ఖండించారు. కోవిడ్ పాజిటివ్ రావడంతో పరిస్థితి విషమించిన స్థితిలో శ్రవణ్‌ను ఎస్‌ఎల్ రహేజా ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందించారు. కానీ ఫలితం దక్కలేదు.