అండర్‌గ్రౌండ్ వాటర్ ట్యాంక్ క్లీన్ చేసేందుకు వెళ్లి నలుగురు కార్మికులు మృతి
మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఘోర విషాదం జరిగింది.
By Knakam Karthik Published on 9 March 2025 6:17 PM IST
అండర్‌గ్రౌండ్ వాటర్ ట్యాంక్ క్లీన్ చేసేందుకు వెళ్లి నలుగురు కార్మికులు మృతి
మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఘోర విషాదం జరిగింది. ముంబైలోని నాగ్‌పడాలో నిర్మాణంలో ఉన్న ఒక అండర్ గ్రౌండ్ వాటర్ ట్యాంక్‌ను శుభ్రం చేయడానికి లోపలికి దిగిన నలుగురు కార్మికులు ఊపిరాడక మరణించినట్లు పోలీసులు తెలిపారు. ఆదివారం ఉదయం 11.30 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు చెప్పారు. ఐదుగురు కాంట్రాక్ట్ కార్మికులు నిర్మాణంలో ఉన్న బిస్మిల్లా స్పేస్‌లోని ట్యాంక్‌లోకి శుభ్రం చేయడానికి వెళ్లి స్పృహ కోల్పోయారు.
మృతులు హసిపాల్ షేక్ (19), రాజా షేక్ (20), జియావుల్లా షేక్ (36), ఇమాండు షేక్ (38)లుగా గుర్తించినట్లు బృహన్ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ (బిఎంసి) ఒక ప్రకటనలో తెలిపింది. మరో కార్మికుడు పుర్హాన్ షేక్ (31)చికిత్స పొందుతున్నట్లు పేర్కొంది. కాగా జరిగిన ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఘటనపై అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ సురేష్ సాగర్ మాట్లాడుతూ “అండర్ గ్రౌండ్‌లో ఒక వాటర్ ట్యాంక్ ఉంది, అక్కడ కొన్ని ప్లైవుడ్ పదార్థాలు చిక్కుకున్నాయి. కార్మికులలో ఒకరు ఆ కలపను బయటకు తీసి ట్యాంక్‌లోని మూసుకుపోవడానికి వెళ్ళినప్పుడు అతను చిక్కుకున్నాడు. దీని తరువాత, మిగిలిన నలుగురు కార్మికులు అతన్ని రక్షించడానికి వెళ్లి ట్యాంక్‌లో పడిపోయారు…” అని అన్నారు. అయితే ఇది ఒక ప్రైవేట్ బిల్డింగ్ అయిన కారణంగా BMC ఎటువంటి చర్య తీసుకోదు. తదుపరి చర్య తీసుకోవాలని మేము పోలీసు శాఖకు తెలియజేసాము" అని సాగర్ అన్నారు