మాస్క్ జారిందని.. ఆటోవాలాపై పోలీసుల ప్ర‌తాపం.. న‌డి రోడ్డుపైనే చిత‌క‌బాదారు

MP man was beaten mercilessly by cops. ఓ వ్య‌క్తి మాస్క్‌ను స‌రిగా పెట్టుకోలేద‌ని పోలీసులు త‌మ లాఠీల‌కు ప‌ని చెప్పారు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  7 April 2021 12:24 PM IST
police give punishment

ప్ర‌స్తుతం దేశంలో క‌రోనా సెకండ్ వేవ్ శ‌ర‌వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఈ మ‌హ‌మ్మారిని క‌ట్ట‌డి చేసేందుకు అన్ని రాష్ట్రాలు క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటున్నాయి. బ‌హిరంగ ప్ర‌దేశాల్లో మాస్కుల‌ను ధ‌రించ‌డం త‌ప్ప‌నిస‌రి చేశాయి. కొన్ని చోట్ల మాస్కులు ధరించ‌ని వారికి జ‌రిమానా విధిస్తున్నారు. అయితే.. ఓ వ్య‌క్తి మాస్క్‌ను స‌రిగా పెట్టుకోలేద‌ని పోలీసులు త‌మ లాఠీల‌కు ప‌ని చెప్పారు. ఆ వ్య‌క్తిని అత‌డి కుమారుడి ముందే.. న‌డి రోడ్డుపై చిత‌క‌బాదారు. ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. అత‌డిపై పోలీసులు వ్య‌వ‌హ‌రించిన తీరు వివాదాస్ప‌ద‌మైంది. పోలీసుల తీరుపై నెటీజ‌న్లు దుమ్మెత్తిపోస్తున్నారు. ఈ ఘ‌ట‌న ‌మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని ఇండోర్‌లో చోటుచేసుకుంది.

వివ‌రాల్లోకి వెళితే.. ఇండోర్‌కు చెందిన కృష్ణ కేయర్‌(35) అనే వ్య‌క్తి ఆటో డ్రైవ‌ర్‌. ఇటీవ‌ల అత‌డి తండ్రి ఆస్ప‌త్రిలో చేరారు. దీంతో త‌న తండ్రిని చూసేందుకు కొడుకుతో క‌లిసి ఆటోలో బ‌య‌లుదేరారు. అయితే..అత‌డు ధ‌రించిన మాస్క్ ముక్కు కింద‌కు జారిపోయింది. దీనిని గ‌మ‌నించిన పోలీసులు అత‌డిని ఆపారు. ఇరువురి మ‌ధ్య కొద్ది సేపు వాగ్వాదం జ‌రిపింది. ఈక్ర‌మంలో ఆ ఆటోడ్రైవ‌ర్‌ను పోలీస్ స్టేష‌న్‌కు రావాల‌ని చెప్పారు. ఇందుకు ఆ ఆటో డ్రైవ‌ర్ నిరాక‌రించ‌డంతో స‌ద‌రు పోలీసులు ఆ ఆటో వాలాపై దాడికి దిగారు. ఇష్టం వ‌చ్చిన‌ట్లు అత‌డిని చిత‌క‌బాదారు. అంతేనా కాళ్ల‌తో కూడా త‌న్నారు.

ఆ రోడ్డుపై చాలా మంది వెలుతున్నా ఒక్క‌రు కూడా పోలీసుల‌ను ఆపేందుకు ధైర్యం చేయ‌లేక‌పోయారు. అయితే.. కొంద‌రు ఈ ఘ‌ట‌న మొత్తాన్ని వీడియో తీశారు. దీనిని సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియో వైర‌ల్ కాగా.. పోలీసుల తీరుపై నెటీజ‌న్లు దుమ్మెత్తి పోశారు. ఉన్న‌తాధికారుల‌కు ఈ విష‌యం తెలియ‌డంతో దాడికి పాల్ప‌డిన పోలీసుల‌ను క‌మ‌ల్ ప్ర‌జాప‌త్‌, ధ‌ర్మేంద్ర జాట్‌లుగా గుర్తించారు. అనంత‌రం వారిని స‌స్పెండ్ చేశారు.




Next Story