కరెంట్‌ను ముట్టుకోకుండానే ఓ వ్యక్తికి షాక్ తగిలింది. అది ఎలా అని ఆశ్చర్యపోకండి. కేవలం కరెంట్ బిల్లు చూసి ఓ వ్యక్తి ఆస్పత్రి పాలయ్యాడు. ఇంటికి వచ్చిన బిల్లు చూసి అతడే కాదు ఆ బిల్లు చూసిన అందరూ షాకైపోతున్నారు. ఎంతని అంటారా..? రూ. 3419 కోట్ల బిల్లు వచ్చింది.
వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని గ్వాలియర్ నగరంలో శివ్ విహార్ కాలనీలో ప్రియాంక గుప్తా తన కుటుంబంతో నివసిస్తోంది. ఆమె ఇంటికి రూ.3419 కోట్ల కరెంట్ బిల్లు వచ్చింది. ఆ బిల్లును చూసిన ప్రియాంక మామగారు(భర్త తండ్రి) షాక్‌కు గురై, తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. కాగా.. మానవతప్పిదం వల్ల ఇంత బిల్లు వచ్చినట్లు ప్రభుత్వ ఆధీనంలోని విద్యుత్ సంస్థ తెలిపింది. సవరించిన బిల్లు రూ.1300 ఇవ్వడంతో గుప్తా కుటుంబ సభ్యులు అంతా ఊపిరిపీల్చుకున్నారు.
ఈ విషయంపై ప్రియాంక గుప్తా భర్త సంజీవ్ కంకనే మాట్లాడుతూ.. జులైలో గృహ వినియోగానికి సంబంధించిన విద్యుత్ బిల్లులో కోట్లాదిరూపాయలను చూసి తన తండ్రి అనారోగ్యం పాలయ్యాడని తెలిపారు. ఆ తర్వాత బిల్లును రాష్ట్ర విద్యుత్ సంస్థ సరిచేసిందన్నారు. భారీ విద్యుత్ బిల్లుకు మానవ తప్పిదమే కారణమని, సంబంధిత ఉద్యోగులపై చర్యలు తీసుకున్నామని ఎంపీఎంకేవీవీసీ జనరల్ మేనేజర్ నితిన్ మాంగ్లిక్ తెలిపారు. సాఫ్ట్‌వేర్‌లో వినియోగించిన యూనిట్ల స్థానంలో ఒక ఉద్యోగి వినియోగదారు నంబర్‌ను ఎంటర్ చేయడంతో ఎక్కువ మొత్తంలో బిల్లు వచ్చిందన్నారు.