కరోనా ముప్పు ఇంకా పూర్తిగా తొలగిపోని నేపథ్యంలో మధ్యప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ కార్యాలయంలో ఐదు రోజుల పని విధానాన్ని వచ్చే ఏడాది మార్చి వరకూ పొడిగించింది. శనివారం ఈ మేరకు ఆ రాష్ట్ర సాధారాణ పరిపాలన విభాగం ఓ నోటిఫికేషన్‌ను జారీ చేసింది. కరోనా కారణంగా ప్రభుత్వ కార్యాలయాల్లో సోమవారం నుంచి శుక్రవారం( ఐదు రోజుల విధుల) పని విధానాన్ని మార్చి 31, 2022 వరకు పొడిగిస్తున్నట్లు ఆ నోటిఫికేషన్‌లో పేర్కొంది.
కరోనా సెకండ్ వేవ్ సమయంలో ఐదు రోజుల పని విధానాన్ని మధ్యప్రదేశ్ ప్రభుత్వం తీసుకువచ్చింది. ఈ ఏడాది జూలై 22 నుంచి ఈ విధానాన్ని ప్రవేశపెట్టింది. అక్టోబర్ 31తో గడువు ముగియనున్న నేపథ్యంలో పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇదిలా ఉంటే.. శుక్రవారం రాష్ట్రంలో 8 కేసులు మాత్రమే నమోదయ్యాయి. మృతుల సంఖ్య కూడా 10,525 వద్దే నిలకడగా ఉంది. ఇంతవరకూ 7,82,126 మంది కోలుకోగా, కేవలం 80 యాక్టివ్ కేసులే ఉన్నట్టు ఆరోగ్య శాఖ ఓ అధికారిక ప్రకటనలో తెలిపింది.