ట్యాంక‌ర్ బోల్తా.. ఎగ‌బ‌డిన ప్ర‌జ‌లు.. మంట‌లు అంటుకుని ఇద్ద‌రు మృతి.. 25 మందికి తీవ్ర‌గాయాలు

MP Fire Breaks out in Fuel Tanker 2 dead over 25 injured.రోడ్డుపై వెలుతున్న ఇంధ‌న ట్యాంక‌ర్ బోల్తా ప‌డింది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  26 Oct 2022 2:31 PM IST
ట్యాంక‌ర్ బోల్తా.. ఎగ‌బ‌డిన ప్ర‌జ‌లు.. మంట‌లు అంటుకుని ఇద్ద‌రు మృతి.. 25 మందికి తీవ్ర‌గాయాలు

రోడ్డుపై వెలుతున్న ఇంధ‌న ట్యాంక‌ర్ బోల్తా ప‌డింది. ఈ విష‌యాన్ని గ‌మ‌నించిన గ్రామ‌స్తులు ట్యాంక‌ర్ నుంచి ఇంధ‌నం తెచ్చుకునేందుకు వెళ్లారు. అయితే.. అదే స‌మ‌యంలో మంటలు చెల‌రేగి ఇద్ద‌రు స‌జీవ ద‌హ‌నం అయ్యారు. మ‌రో 25 మంది తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. ఈ ఘ‌ట‌న మ‌ధ్య‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని ఖర్గోన్‌ జిల్లాలో జ‌రిగింది.

వివ‌రాలు ఇలా ఉన్నాయి. ఇండోర్ నుంచి ఖార్గోన్ వైపు వెలుతున్న ఇంధ‌న ట్యాంక‌ర్ బుధ‌వారం ఉద‌యం 6 గంట‌ల ప్రాంతంలో బిస్తాన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అంజన్‌గావ్ గ్రామ సమీపంలో బోల్తా ప‌డింది. ఈ విష‌యం క్ష‌ణాల్లోనే గ్రామంలోని ప్ర‌జ‌ల‌కు తెలియ‌డంతో ఇంధ‌నాన్ని ఎత్తుకెళ్లేందుకు పెద్ద ఎత్తున గ్రామ‌స్తులు అక్క‌డ‌కు చేరుకున్నారు. ఇంధ‌నం కోసం పోటిప‌డ్డారు.

అయితే.. అదే స‌మ‌యంలో మంట‌లు చెల‌రేగాయి. క్ష‌ణాల్లో ట్ర‌క్కు మొత్తానికి వ్యాపించాయి. ఇంధ‌నం ఎత్తుకెలుతున్న గ్రామ‌స్తుల‌కు మంట‌లు అంటుకున్నాయి. ఘ‌ట‌నాస్థ‌లంలోనే ఇద్ద‌రు స‌జీవ ద‌హ‌నం కాగా.. మ‌రో 25 మంది వ‌ర‌కు తీవ్రంగా గాయప‌డ్డారు. స‌మాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాప‌క సిబ్బంది ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకుని స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు. మంట‌ల‌ను ఆర్పి బాధితుల‌ను ఆస్ప‌త్రికి త‌ర‌లించారు.

తీవ్రంగా గాయపడిన 15 మందిని ఇండోర్‌కు తరలించామని, మ‌రో 10 మంది క్షతగాత్రులు ఖర్గోన్ జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని ఖర్గోన్ ఎమ్మెల్యే రవి జోషి తెలిపారు.

ఈ ఘ‌ట‌న‌పై ముఖ్య‌మంత్రి శివ‌రాజ్‌సింగ్ చౌహాన్ తీవ్ర దిగ్భ్రాంత్రిని వ్య‌క్తం చేశారు."ఇండోర్ నుండి ఖార్గోన్ వెళ్తున్న ట్యాంక‌ర్‌ గురించి విచారకరమైన వార్త అందింది, బిస్తాన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అంజన్‌గావ్ సమీపంలో బోల్తా పడింది, ఇందులో చాలా మంది వ్యక్తులు గాయపడ్డారు మరియు మరణించారు. మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను." అని ట్వీట్ చేశారు.క్ష‌త‌గాత్రుల‌కు మెరుగైన చికిత్స అందించాల‌ని అధికారుల‌ను ఆదేశించిన‌ట్లు చెప్పారు.

Next Story