ఆయనో ఎంపీ అయితే ఏం.. తాను మాటలు చెప్పే నాయకుడిని కాదని నిరూపించారు. ఓ కొవిడ్ సెంటర్‌ను సందర్శించిన ఆయనకు అక్కడ ఉన్న టాయిలెట్ అపరిశుభ్రంగా కనిపించింది. ఆస్పత్రిలోని సిబ్బందికి గానీ.. అధికారులకు గానీ.. క్లీన్ చేయమనే ఆదేశాలు ఇవ్వకుండా.. వెంటనే తానే స్వయంగా రంగంలోకి దిగి టాయిలెట్ ను క్లీన్ చేశారు. కనీసం బ్రష్ కూడా ఉపయోగించకుండా చేతులకు గ్లౌజ్‌లు మాత్రమే ధరించి ఆయన ఈ పని చేయడం విశేషం. ఈ ఘటన మధ్య ప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది.
వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని రేవా నియోజకవర్గానికి ఎంపీగా జనార్ధన్ మిశ్రా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. క్వారంటైన్ లో ఎలాంటి చికిత్స అందిస్తున్నారు ? తదితర వివరాలు తెలుసుకొనేందుకు ఆయన మంగళవారం కొవిడ్ కేర్ సెంటర్‌ను ఆకస్మిక తనిఖీ చేశారు. కొవిడ్ బాధితులను పరామర్శించి తిరిగి వెలుతుండగా.. అక్కడి టాయిలెట్స్ అపరిశుభ్రంగా ఉన్న విషయాన్ని గుర్తించారు. వెంటనే దానిన శుభ్రం చేసే పనిలో పడ్డారు. ఎంపీ ఒక్కరే ఈ పనిని చేశారు. చేతులకు గ్లౌజులు ధరించి టాయిలెట్‌ను పరిశుభ్రపరిచారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. తాను ఇటువంటి పని చేయడం ద్వారా చాలామంది ఇటువంటి పనులు చేసేందుకు ముందుకు వస్తారన్నారు. ఇందులో సిగ్గు పడాల్సిన అవసరం లేదని అన్నారు. మన పరిసరాలను మనమే శుభ్రం చేసుకోవాలి అంటూ చెప్పు కొచ్చారు.
పబ్లిక్ టాయిలెట్స్‌ను ఎంపీ జనార్ధన్ క్లీన్ చేయడం ఇదే తొలిసారి కాదు. 2018లో ఓ పాఠశాలలో కూడా టాయిలెట్స్‌ను పరిశుభ్రం చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఎంపీని చూసి అయినా.. అధికారుల్లో ఇప్పటికైనా మార్పు రావాలని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.