పెళ్లి బారాత్‌లు, ఇతర వేడుకల్లో ఎంటర్‌టైన్‌మెంట్ కోసం సినిమా పాటలు ప్లే చేస్తుంటారు. ఇలా వేడుకల్లో సినిమా పాటలు ప్లే చేయడం కాపీరైట్ ఉల్లంఘన కిందకు వస్తుందని పేర్కొంటూ పలు సొసైటీలు రాయల్టీలను వసూలు చేస్తున్నాయి. తాజాగా దీనిపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. వేడుకల్లో సినిమా పాటలను ప్లే చేయడం కాపీరైట్ ఉల్లంఘన కిందకు రాదని స్పష్టం చేసింది. వీటిపై చట్టపరంగా ఎలాంటి చర్యలు తీసుకోలేరని పేర్కొంది. పెళ్లి వేడుకల్లో బాలీవుడ్ సినిమా పాటల ప్రదర్శన కోసం కాపీరైట్ సొసైటీలు రాయల్టీ వసూలు చేస్తున్నాయని కేంద్రానికి ఫిర్యాదులు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం దీనిపై స్పష్టమైన వివరణ ఇచ్చింది.
సెక్షన్ 52 స్ఫూర్తికి విరుద్ధంగా పెళ్లిలు, ఇతర వేడుకలో సినిమా పాటలను ప్రదర్శించి కాపీరైట్ ఉల్లంఘనకు పాల్పడ్డారని పేర్కొంటూ పలు సొసైటీలు రాయల్టీలను వసూలు చేయడంపై సాధారణ ప్రజలు, ఇతరుల నుంచి డిపార్ట్‌మెంట్ ఫర్ ప్రమోషన్, ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్‌కి అనేక ఫిర్యాదులు అందాయని కేంద్రం తెలిపింది. ఇది కాపీ రైట్ యాక్ట్ 1957లోని సెక్షన్ 52(1)కు విరుద్ధమని, మతపరమైన కార్యక్రమాలు, అధికారిక వేడుకల్లో ప్రదర్శించే నాటక, సాహిత్య, మ్యూజిక్ లేదా ఏదైనా సౌండ్ రికార్డింగ్ లు కాపీరైట్ ఉల్లంఘన కిందకు రావని సెక్షన్ 52(1) (za) చెబుతోందని వెల్లడించింది. మతపరమైన వేడుకలతో పాటు వివాహ ఊరేగింపు, ఇతర ఇతర సామాజిక ఉత్సవాలు ఇందులోకి వస్తాయి. వీటిని దృష్టిలో ఉంచుకుని.. సెక్షన్ 52 (1) (za)కి విరుద్ధంగా ఎటువంటి చట్టపరమైన చర్యలు తీసుకోకుండా కాపీరైట్ సొసైటీలకు ఆదేశాలు ఇచ్చామని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.