అండమాన్‌ను తాకిన నైరుతి రుతుపవనాలు..ఐఎండీ కీలక ప్రకటన

ఎండలతో అల్లాడుతున్న ప్రజలకు చల్లని కబురు వచ్చేసింది. ఈ మేరకు భారత వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది.

By Knakam Karthik
Published on : 13 May 2025 9:10 AM

National News, IMD, Weather update, Monsoon, southwestmonsoon, Rainfall

అండమాన్‌ను తాకిన నైరుతి రుతుపవనాలు..ఐఎండీ కీలక ప్రకటన

ఎండలతో అల్లాడుతున్న ప్రజలకు చల్లని కబురు వచ్చేసింది. ఈ మేరకు భారత వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది. మరో నాలుగైదు రోజుల్లో నైరుతి రుతుపవనాలు అండమాన్, నికోబార్ దీవులతో పాటు దక్షిణ మధ్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలకు విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నట్లు వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. మే 14న అండమాన్ కు సమీపంలో ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు చెప్పింది.

ఇది అల్పపీడనంగా మారితే ఏపీ వ్యాప్తంగా మే నెలాఖరు వరకూ చెదురుమదురు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. 13,14 తేదీల్లో ఉత్తర కోస్తా, రాయలసీమ, 15వ తేదీన రాయలసీమ ప్రాంతాల్లో భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. రానున్న మూడ్రోజుల్లో దేశంలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిస్తే.. మరికొన్ని ప్రాంతాల్లో భారీ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని ఐఎండీ హెచ్చరించింది.

మే 27 నాటికి ఈ రుతుపవనాలు కేరళను తాకే అవకాశం ఉన్నట్లు ఇప్పటికే వాతావరణ శాఖ అంచనా వేసిన సంగతి తెలిసిందే. సాధారణంగా జూన్‌ 1 నాటికి రుతుపవనాలు పలకరిస్తుంటాయి. ఈ సారి మాత్రం అంతకంటే ముందుగానే వచ్చేందుకు అవకాశాలు కన్పిస్తున్నాయి. అలా జరిగితే 2009 తర్వాత రుతుపవనాలు అంచనాల కంటే ముందుగా రావడం మళ్లీ ఇప్పుడే అవుతుంది. ఆ ఏడాది మే 23నే నైరుతి రుతుపవనాలు కేరళను తాకాయి. ఈ సారి సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

Next Story