వ‌చ్చే 25 ఏళ్ల‌లో ప్ర‌తి అడుగూ కీల‌క‌మే

Modi Independence Day Speech.శతాబ్ది ఉత్సవాల నాటికి భారత్‌ ప్రబలశక్తిగా ఎదగాలనే సంకల్పం తీసుకోవాలని

By తోట‌ వంశీ కుమార్‌  Published on  15 Aug 2021 9:15 AM IST
వ‌చ్చే 25 ఏళ్ల‌లో ప్ర‌తి అడుగూ కీల‌క‌మే

శతాబ్ది ఉత్సవాల నాటికి భారత్‌ ప్రబలశక్తిగా ఎదగాలనే సంకల్పం తీసుకోవాలని దేశ ప్ర‌జ‌ల‌కు ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ పిలుపునిచ్చారు. 75వ స్వాతంత్ర్య అమృత ఉత్స‌వాల సంద‌ర్భంగా ఎర్ర‌కోట‌పై జాతీయ జెండాను ఎగుర‌వేసిన అనంత‌రం దేశ ప్ర‌జ‌ల నుద్దేశించి ప్ర‌ధాని ప్ర‌సంగించారు. 75 నుంచి శతాబ్ది ఉత్సవాల మధ్య 25 ఏళ్లకాలం అమృత ఘడియలని, అమృత కాలాన్ని సర్వ సమృద్ధ భారత్‌ నిర్మాణానికి మనం సంకల్పం తీసుకోవాల‌న్నారు. కేవలం సంకల్పం తీసుకుంటే సరిపోదని.. నిరంతర శ్రమ, పట్టుదలతోనే సాకారం అవుతుందన్నారు. ఈ 25 ఏళ్లను సద్వినియోగం చేసుకునేందుకు ప్రతి అడుగు కీలకమేనని, ఒక్క క్షణం వృథా చేయకుండా ప్రతి పౌరుడు సంకల్ప శక్తితో ముందుకు నడవాలన్నారు.

స్వాతంత్ర్యం కోసం పోరాటం చేసిన త్యాగ‌ధ‌నుల‌ను నేడు దేశం స్మ‌రించుకుంటోందన్నారు. మ‌నం ఇప్పుడు స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని, కానీ విభజన నాటి ఆవేదన ఇప్పటికీ భారతదేశ ఛాతీని చీల్చుతోందని ప్రధాని మోదీ భావోద్వేగానికి లోనయ్యారు. గత శతాబ్దంలో జరిగిన గొప్ప విషాదాలలో ఇది ఒకటన్నారు. నిన్ననే దేశం భావోద్వేగ నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 14 ను విభీషణ స్మారక దినంగా గుర్తుంచుకుందామ‌ని పిలుపునిచ్చారు.

టీకా కోసం మనం ఇతర దేశాలపై ఆధారపడాల్సిన అవసరం లేదని, దేశంలో వ్యాక్సిన్ లేకపోతే ఏమి జరిగి ఉండేదో మీరు ఊహించుకోండని ప్రధాని పేర్కొన్నారు. ఇక క‌రోనాపై వైద్యులు, సిబ్బంది చేసిన పోరాటం అస‌మానం అని, ప్ర‌జ‌ల ప్రాణాలు కాపాడే వైద్య సిబ్బంది కృషి గురించి ఎంత చెప్పినా త‌క్కువేన‌న్నారు. ఇక ఒలింపిక్స్‌లో ప‌త‌కాలు సాధించిన వారంతా మ‌న‌కు స్పూర్తి. ప‌త‌కాలు సాధించిన వారికి దేశం యావ‌త్తూ గౌర‌వం ప్ర‌క‌టిస్తోంది. వాళ్లు కేవ‌లం ప‌త‌కాలే సాధించ‌లేద‌ని.. న‌వ‌యువ‌త‌కు స్పూర్తిగా నిలిచార‌న్నారు.

ఏడేళ్లలో ఉజ్వల నుంచి ఆయుష్మాన్‌ వరకు అనేక పథకాలు కోట్ల మంది ప్రజల ముంగిట చేరాయన్నారు. ప్రతి సంక్షేమ కార్యక్రమంలో సంతృప్త స్థాయికి తీసుకెళ్లాయని, సంక్షేమ, అభివృద్ధి పథకాల హక్కుదారులకు వందశాతం చేరేలా చేయాలన్నారు. చిన్న వ్యాపారులు, దుకాణదారులు అందరినీ బ్యాంకులతో అనుసంధానం చేయాలని తెలిపారు. ఇంటింటికీ విద్యుత్‌, తాగునీరు ఇంకా సుదూర స్వప్నం కాకూడదని.. ప్రతి ఇంటికీ కరెంటు, తాగునీరు అందించడం మనందరి బాధ్యతన్నారు. వచ్చే రెండేళ్లలో ప్రతి ఇంటికీ నల్లద్వారా సురక్షిత తాగునీరు అందించాలన్నారు.

Next Story