చిన్నారి గురించి చలించిపోయిన ప్రధాన మోదీ.. రూ. 6.5 కోట్ల సుంకం రద్దు
Modi govt waives off Rs 6 crore tax for importing life-saving medicines. ఓ చిన్నారి పడుతున్న బాధను చూసి ప్రధాని నరేంద్రమోదీ సైతం చలించిపోయారు.రూ. 6.5 కోట్ల సుంకం రద్దు.
By Medi Samrat Published on 11 Feb 2021 2:16 PM GMTఓ చిన్నారి పడుతున్న బాధను చూసి ప్రధాని నరేంద్రమోదీ సైతం చలించిపోయారు. చిన్నారికి అండగా నిలిచారు. వివరాల్లోకి వెళితే..ముంబైలో తీరా కామత్ అనే ఐదు నెలల చిన్నారి అరుదైన వ్యాధితో బాధపడుతోంది. చిన్నారికి అవసరమైన మెడిసిన్ భారత్‌లో లభించవు. ఇతర దేశాల్లో లభిస్తాయి. అయితే మెడిసిన్ దిగుమతి విషయంలో మోదీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఔషధాల దిగుమతికి సుమారు రూ.6.5 కోట్ల మేర సుంకాన్ని కేంద్రం రద్దు చేసింది. దీని వల్ల ఇంజెక్షన్ దిగుమతి, పాప చికిత్సకు మార్గం క్లియర్ అయింది. బాలిక తల్లిదండ్రుల విజ్ఞప్తి మేరకు మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవంద్ర పడ్నావీస్ ఈనెల 2న చిన్నారి విషయమై ప్రధాని నరేంద్రమోదీ దృష్టికి తీసుకువచ్చారు. దీంతో కేంద్రం ఈ మేరకు చర్యలు చేపట్టింది. స్పైనల్ మాస్కులర్ ఆట్రోపీ అనే వ్యాధితో బాధపడుతున్న చిన్నారిని ఆదుకునేందుకు ఎందరో దాతలు విరాళాలు అందించారు.
రూ. 16 కోట్ల విరాళాలు
ఐదు నెలల చిన్నారి పరిస్థితిని చూసి చలించిపోయారు. దాతలు విరాళాలు అందజేశారు. విరాళాలతో క్రౌడ్ ఫండింగ్ ద్వారా ఏకంగా రూ.16 కోట్ల నిధులు సమకూరాయి. అయినా మెడిసిన్ సరిపడా డబ్బులు సమకూరలేదు. జీఎస్టీ విధిస్తే పెద్ద మొత్తంలో డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. దీంతో చిన్నారి తల్లిదండ్రులు కేంద్ర ప్రభుత్వాన్ని ఆశ్రయించారు. అయితే అమెరికా నుంచి దిగుమతి చేసుకోబోయే మెడిసిన్స్‌కు సుంకాలు ఉండటంతో భారీగా భారం పడుతోందని తల్లిదండ్రులు తెలిపారు. వివిధ రకాల పన్నులను మినహాయిస్తే తన పాపకు చికిత్స అందుతుందని కోరారు.
అయితే ఈ వ్యాధి ఔషధాలు విదేశాల్లో మాత్రమే అందుబాటులో ఉన్నందున వాటికి దిగుమతికి అయ్యే ఖర్చులు, జీఎస్టీ ఎక్సైజ్ సుంకం కలిపి అదనంగా మరో రూ.6.5 కోట్లు అవసరమయ్యాయి. దీంతో అంత డబ్బు తమ వద్దలేదని, దిగుమతి సుంకాలు తగ్గించాలని కోరుతూ పాప తల్లిదండ్రులు కూడా గతంలో ప్రధాని మోదీకి లేఖ రాశారు. దీంతో స్పందించిన మోదీ సర్కార్ చిన్నారి ఔషధాల దిగుమతిపై సుంకాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో చిన్నారికి అవసరమైన మెడిసిన్‌ను అమెరికా నుంచి దగుమతి చేసుకుంటున్నారు. మరో వైపు అరుదైన జన్యుసంబంధ వ్యాధితో బాధపడుతున్న చిన్నారి ప్రాణాలను కాపాడేందుకు పెద్ద మనసుతో సాయం చేసిన ప్రధాని మోదీకి మహారాష్ట్ర బీజేపీ నేత, మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర పడ్నావీస్ కృతజ్ఞతలు తెలిపారు. మానవత్వంలో స్పందించి దాదాపు రూ.6.5 కోట్ల మేర సుంకాన్ని రద్దు చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. తీరా చిన్నారి త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు.