కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మోదీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఉద్యోగులకు చెల్లించే డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ)ను నాలుగు శాతం పెంచుతూ తాజాగా నిర్ణయం తీసుకుంది. ప్రధాని మోదీ నేతృత్వంలో జరిగిన కేబినెట్ భేటీలో డీఏ పెంపునకు ఆమోదం లభించింది. తాజా పెంపుతో డీఏ మొత్తం 34 నుంచి 38 శాతానికి చేరింది. డీఏ పెంపుతో సుమారు 50 లక్షల మంది ఉద్యోగులు, 62 లక్షల మంది పెన్షనర్లకు ప్రయోజనం కలగనుంది. డీఏను 4 శాతం పెంచినట్లు కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. ఈ పెంపు జూలై 1, 2022 నుంచి అమల్లోకి వస్తుంది.
ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ ఆన్ యోజనని డిసెంబర్ 2022 వరకు మరో మూడు నెలల పాటు పొడిగించేందుకు కూడా క్యాబినెట్ ఆమోదించింది. డిసెంబర్ 2022 వరకు మరో మూడు నెలల పాటు 80 కోట్ల మందికి ఉచిత రేషన్ అందించే పథకానికి రూ.44,700 కోట్లు ఖర్చవుతుందని ఠాకూర్ చెప్పారు.
ఏడో వేతన సంఘం సిఫార్సుల మేరకు ఈ ఏడాది మొదట్లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మూడు శాతం డీఏ పెంచారు. దీంతో మూల వేతనంలో డీఏ 34 శాతానికి చేరింది. తాజాగా డీఏ పెంపు నిర్ణయంతో అది 38 శాతానికి పెరిగింది. కేంద్ర ప్రభుత్వం డీఏ పెంచిన నేపథ్యంలో రాష్ట్రాలు సైతం తమ ఉద్యోగులకు ఆ మేర డీఏ పెంచే ఛాన్స్ ఉంది. ప్రతి ఏడాది రెండుసార్లు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏను కేంద్రం సవరిస్తూ ఉంటుంది.