ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎమ్మెల్యేలు సౌరభ్ భరద్వాజ్, అతిషి పేర్లను తన క్యాబినెట్ మంత్రులుగా చేర్చుకోవడానికి ఢిల్లీ లెప్టినెంట్ గవర్నర్ వికె సక్సేనాకు పంపారు. కొత్తగా చేరనున్న మంత్రుల ప్రమాణ స్వీకార ప్రక్రియ 48 గంటల్లో పూర్తయ్యే అవకాశం ఉందని సంబంధిత వర్గాల సమాచారం. ఆప్ మంత్రులు మనీష్ సిసోడియా, సత్యేందర్ జైన్ వేర్వేరు ఆరోపణలపై జైలులో ఉండటం.. వారు మంగళవారం తమ పదవులకు రాజీనామా చేసిన విఫయం తెలిసిందే. వారి రాజీనామాలను ఆమోదించిన కేజ్రీవాల్.. నేడు ఎమ్మెల్యేలు సౌరభ్ భరద్వాజ్, అతిషి లను తన మంత్రి వర్గంలోకి తీసుకుంటున్నట్లు ఇరువురి పేర్లను లెప్టినెంట్ గవర్నర్ కు పంపడం జరిగింది.
ఢిల్లీ మద్యం కుంభకోణంలో మనీష్ సిసోడియా అరెస్టు, మనీలాండరింగ్ కేసులో సత్యేందర్ జైన్ అరెస్టు అనంతరం ఢిల్లీ మంత్రి వర్గంలో కనీసం 20 పోర్ట్‌ఫోలియోలు ఖాళీగా ఉన్నట్లు తెలుస్తోంది. మనీష్ సిసోడియా ఢిల్లీ ఉపముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విద్యతో సహా అనేక ఉన్నత స్థాయి శాఖలను నిర్వర్తించేవారు. సత్యేంద్ర జైన్ ఢిల్లీ ఆరోగ్య మరియు జైళ్ల మంత్రిగా ఉన్నారు. సిసోడియాకు నిర్వర్తించిన ఫైనాన్స్, విద్యతో సహా కొన్ని పోర్ట్‌ఫోలియోలు కైలాష్ గహ్లోట్, రాజ్ కుమార్ ఆనంద్‌లకు అప్పగించనున్నట్లు తెలుస్తోంది.