డాక్టర్‌ను కొట్టిన కూతురు.. బహిరంగ క్షమాపణలు చెప్పిన సీఎం

Mizoram CM apologizes after daughter's attack on doctor. సీఎం జోరంతంగా కూతురు మిలారీ చాంగ్టే.. ఐజ్వాల్‌లోని చర్మవాధుల క్లినిక్‌కు వైద్య పరీక్షల కోసం బుధవారం వెళ్లింది.

By అంజి  Published on  21 Aug 2022 5:03 PM IST
డాక్టర్‌ను కొట్టిన కూతురు.. బహిరంగ క్షమాపణలు చెప్పిన సీఎం

సాధారణంగా సీఎం కూతురుకు ఉండే హోదానే వేరు. ఆమె ఎక్కడికి వెళ్లినా ఘనంగా స్వాగతిస్తుంటారు. ఆమెకు పోలీసు రక్షణ కూడా ఉంటుంది. ఇక ఆమె ఎదైనా అనుకుంటే.. చిటికేలో పని పూర్తి కావాల్సిందే. ఆమెకు కోపం వచ్చేదాక ఎవరూ చూడరు. అయితే తాజాగా ఓ డాక్టర్‌.. సీఎం కూతురు ఆదేశాలను ధిక్కరించాడు. మిజోరాం రాష్ట్రంలోని ఐజ్వాల్‌లో ఈ ఘటన జరిగింది. మిజోరాం సీఎం జోరంతంగా కూతురు ఆదేశాలను డాక్టర్‌ ధిక్కరించాడు. దీంతో ఆమెకు కోపం కట్టలు తెంచుకుని.. డాక్టర్‌పై దాడి చేసింది. దీనికి సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్‌గా మారాయి. దీంతో మిజోరాం సీఎం జోరంతంగా క్షమాపణలు చెబుతూ బహిరంగ లేఖ రిలీజ్‌ చేశారు.

సీఎం జోరంతంగా కూతురు మిలారీ చాంగ్టే.. ఐజ్వాల్‌లోని చర్మవాధుల క్లినిక్‌కు వైద్య పరీక్షల కోసం బుధవారం వెళ్లింది. అయితే అపాయింట్‌మెంట్‌ లేనిదే తాను వైద్యం చేయనని డాక్టర్‌ చెప్పాడు. క్లినిక్‌ మూసివేసే లోపు అపాయింట్‌మెంట్‌ తీసుకోవాలని సూచించాడు. దీంతో ఆగ్రహించిన మిలారీ.. తననే అపాయింట్‌మెంట్‌ తీసుకోమ్మంటావా అంటూ ఆ వైద్యుడి చెంప, ముఖంపై కొట్టింది. ఆమెను వెనక్కి లాగి, సముదాయించేందుకు అక్కడ ఉన్న వారు చాలా ప్రయత్నించారు. అయినా ఆమె డాక్టర్‌ ముఖంపై దాడి చేశారు. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.

దీంతో సీఎం జోరంతంగాపై, ఆయన కుటుంబంపై సోషల్ మీడియాలో విమర్శలు వచ్చాయి. ఈ ఘటనపై ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ మిజోరాం విభాగం వైద్యులు నల్ల బ్యాడ్జీలు ధరించి శనివారం ఆందోళనకు దిగారు. దీంతో సీఎం జోరంతంగా క్షమాపణలు చెప్పారు. తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్‌ పేజీ ద్వారా బహిరంగ క్షమాపణలు కోరారు. తాను స్వయంగా రాసిన క్షమాపణ పత్రాన్ని పోస్ట్‌ చేశారు. ఐజ్వాల్‌కు చెందిన చర్మవ్యాధి నిపుణుడితో తన కుమార్తె అనుచిత ప్రవర్తనను ఖండిస్తున్నట్లు చెప్పారు.




Next Story