బీజేపీలో చేరిన ఆ న‌టుడు.. ఓ న‌క్స‌లైట్ : మ‌ండిప‌డ్డ‌ తృణమూల్

Mithun Chakraborty Was Originally a Naxalite, Has No Credibility or Respect. నిన్న మోదీ స‌మ‌క్షంలో బీజేపీ తీర్థం పుచ్చుకున్న బాలీవుడ్ సీనియర్ నటుడు మిథున్ చక్రవర్తిపై తృణమూల్ కాంగ్రెస్ తీవ్రస్థాయిలో ధ్వ‌జ‌మెత్తింది.

By Medi Samrat  Published on  8 March 2021 11:22 AM IST
Mithun Chakraborty Was Originally a Naxalite

బెంగాల్ రాజ‌కీయం హీటెక్కింది. నిన్న మోదీ స‌మ‌క్షంలో బీజేపీ తీర్థం పుచ్చుకున్న బాలీవుడ్ సీనియర్ నటుడు మిథున్ చక్రవర్తిపై తృణమూల్ కాంగ్రెస్ తీవ్రస్థాయిలో ధ్వ‌జ‌మెత్తింది. ఆయనో నక్సలైట్ అంటూ తీవ్రంగా మండిప‌డింది. తృణమూల్ ఎంపీ సౌగత రాయ్ మాట్లాడుతూ.. మిథున్‌ వాస్తవానికి ఓ నక్సలైట్ అని, ఇప్పటికి నాలుగుసార్లు పార్టీలు మారారని ఆరోపించారు.

పాత‌కాలం నటుడైన ఆయనకు విశ్వసనీయత లేదని.. ప్రజలను ఆయన ఏ విధంగానూ ప్రభావితం చేయలేరని వ్యాఖ్యానించారు. ఈడీని చూపించి బెదిరించడంతో భయపడి మిథున్ బీజేపీలో చేరారని విమర్శలు గు‌ప్పించారు. నక్సలైట్ అయిన మిథున్ చక్రవర్తి మొద‌ట‌ సీపీఎంలో చేరారని, ఆ తర్వాత టీఎంసీలో చేరి రాజ్యసభ సభ్యుడు అయ్యారని, ఇప్పుడు బీజేపీ బెదిరింపులకు భయపడి ఆ పార్టీ పంచన చేరారని సౌగత్ రాయ్ తీవ్ర విమర్శలు చేశారు.

ఇదిలావుంటే.. ఆదివారం నాడు బీజేపీ శ్రేణులు కోల్‌కతాలో నిర్వహించిన భారీ ర్యాలీలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన సమక్షంలో మిథున్ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌ మాట్లాడుతూ.. తనను ఎలాంటి హాని చేయని నీటిపాముగా భావించవద్దని.. తాను త్రాచుపాము లాంటివాడినని తెలిపారు. ఒక్క కాటుతో చచ్చిపోతారని హెచ్చరించారు. జీవితంలో ఏదైనా గొప్పగా సాధించాలని అనుకునేవాడినని.. ఇవాళ ప్రపంచంలోనే అత్యధిక ప్రజాదరణ పొందుతున్న నరేంద్ర మోదీ వంటి మహానేత హాజరైన భారీ బహిరంగ సభలో పాల్గొంటానని కలలో కూడా అనుకోలేదని చెప్పారు. సమాజంలో నిరుపేద వర్గాలకు సేవ చేయాలని కోరుకున్నానని, ఆ కోరిక ఇప్పుడు తీరనుందని మిథున్ తెలిపారు.


Next Story