మార్కెట్‌లోకి నకిలీ రూ.500 నోట్లు..కేంద్ర హోంశాఖ హెచ్చరికలు
అత్యాధునిక టెక్నాలజీతో తయారు చేసిన నకిలీ రూ.500 నోట్లు మార్కెట్‌లో చలామణిలోకి వచ్చాయని కేంద్ర హోంశాఖ హెచ్చరికలు జారీ చేసింది.
By Knakam Karthik
మార్కెట్‌లోకి నకిలీ రూ.500 నోట్లు..కేంద్ర హోంశాఖ హెచ్చరికలు
అత్యాధునిక టెక్నాలజీతో తయారు చేసిన నకిలీ రూ.500 నోట్లు మార్కెట్‌లో చలామణిలోకి వచ్చాయని కేంద్ర హోంశాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నకిలీ నోట్లను గుర్తించడం కష్టంగా ఉండటంతో, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర హోంశాఖ సూచించింది. ఈ సమాచారాన్ని డీఆర్‌ఐ, ఎఫ్‌ఐయూ, సీబీఐ, ఎన్‌ఐఏ, సెబీతో కూడా పంచుకొంది. ఆ దొంగనోట్ల ప్రింటింగ్, నాణ్యత చాలావరకు అసలు నోట్లులాగే ఉన్నట్లు వెల్లడించింది. వాటిని గుర్తించడం కూడా చాలా క్లిష్టంగా మారిందని వెల్లడించింది.
కాకపోతే ఈ నోట్లలో ఒక చిన్న స్పెల్లింగ్ తప్పు ఉందని.. దీనిని గుర్తించడంలో అదే కీలకమని పేర్కొంది. “RESERVE BANK OF INDIA" అనే దానిలో ‘‘RESERVE’’ పదంలో ‘E’ బదులు ‘A’ పడినట్లు వెల్లడించింది. ఈ చిన్న తప్పును గుర్తించాలంటే ఆ నోటును క్షుణ్ణంగా పరీక్షించాల్సి ఉంటుంది. ఇలాంటి నకిలీ నోట్లు అత్యంత ప్రమాదకరమని వెల్లడించింది. వీటి విషయంలో ఆర్థిక సంస్థలు, బ్యాంకులు, ఏజెన్సీలను అప్రమత్తంగా ఉంచినట్లు అధికారులు చెబుతున్నారు.
ఇప్పటికే పెద్ద సంఖ్యలో ఇవి మార్కెట్లో ఉన్నాయని హెచ్చరించారు. మార్కెట్లో మొత్తం ఎన్ని ఉన్నాయో గుర్తించడం కష్టమని ఉగ్ర ఫైనాన్స్‌పై దర్యాప్తు చేస్తున్న ఓ అధికారి చెప్పారు. ప్రజలు, వ్యాపార సంస్థలు అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. ప్రజలు ఈ నకిలీ నోట్లను గుర్తించడానికి జాగ్రత్తగా పరిశీలించాలని, అనుమానాస్పద నోట్లను గుర్తించినప్పుడు సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వాలని కేంద్ర హోంశాఖ సూచించింది. నకిలీ నోట్ల వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వం భారతీయ న్యాయ సన్హిత (BNS), 2023, అక్రమ కార్యకలాపాల నిరోధక చట్టం (UAPA), 1967 వంటి చట్టాల కింద కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. కాగా జాతీయ దర్యాప్తు సంస్థ (NIA), FICN సమన్వయ గ్రూప్ (FCORD), టెర్రర్ ఫండింగ్ & ఫేక్ కరెన్సీ సెల్ (TFFC) కూడా ఈ సమస్యను పరిష్కరించేందుకు పనిచేస్తున్నట్లుగా కేంద్ర హోంశాఖ వెల్లడించింది.