కేంద్రప్రభుత్వం రైతులకు శుభవార్త చెప్పింది. రైతుల ఆదాయం పెంచేందుకు, పంటల ఉత్పత్తి పెంపునకు ప్రోత్సాహంలో భాగంగా ఆరు పంటలకు కనీస మద్దతు ధరను పెంచింది. మంగళవారం నరేంద్రమోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినేట్ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ వివరాలను కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ మీడియాకు తెలిపారు.
2022-23 రబీ సీజన్(జూలై-జూన్), మార్కెటింగ్ సీజన్ 2023-24 కాలానికి ఆరు పంటల కనీస మద్దతు ధర పెంచినట్లు మంత్రి చెప్పారు. గోధుమ, ఆవాలు, శనగలు, మసూర్, బార్లీ మరియు కుసుమ పంటల కనీస మద్దతు ధరను పెంచారు.
మద్దతు పెంపు తరువాత ధరలు ఇలా..
- గోధుమల కనీస మద్దతు ధరను రూ.100 పెంచగా.. క్వింటాల్ ధర రూ.2,125కి చేరింది.
- మసూర్ పంట మద్దతు ధర రూ.500 పెంచగా.. క్వింటాల్ ధర రూ.6,000కి పెరిగింది.
- శనగల ధర రూ.150 పెంచగా.. క్వింటాల్ ధర రూ.5,335 కి చేరింది.
- బార్లీ ధర రూ.100 పెంచగా.. క్వింటాల్ ధర రూ.1,735కి పెరిగింది.
- ఆవాల ధర రూ.400 పెంచగా.. క్వింటాల్ ధర రూ.5,450కి చేరింది.
- కుసుమ పంట ధర రూ.209 పెంచగా.. క్వింటాల్ ధర రూ.5650కి పెరిగింది.