విరాళాలు అందుకోవడంలో మజ్లిస్ పార్టీ రూటే వేరయా..!
MIM flying high, TRS skips donor list, reveals EC report. రాజకీయ పార్టీలకు విరాళాలు చాలా అవసరం.. ఎందుకంటే పార్టీ కష్టం అయ్యే అవకాశం ఉంది.
By Medi Samrat Published on 21 Jan 2021 6:24 PM ISTరాజకీయ పార్టీలకు విరాళాలు చాలా అవసరం.. ఎందుకంటే పార్టీ మనుగడే కష్టం అయ్యే అవకాశం ఉంది. భారత ఎన్నికల సంఘానికి (ఈసీ) సమర్పించిన విరాళాల నివేదికలో మజ్లిస్ పార్టీకి భారీగా విరాళాలు అందడాన్ని గమనించవచ్చు. తెలంగాణ నుండి ఇప్పటికే పలు రాష్ట్రాల్లో మజ్లిస్ పార్టీ దూసుకుపోవాలని ప్రయత్నిస్తోంది. బీహార్ ఎన్నికల్లో ఐదు సీట్లు గెలిచిన మజ్లిస్.. ఈ ఏడాది తమిళనాడు, బెంగాల్ ఎన్నికల్లో వీలైనన్ని సీట్లను సంపాదించుకోవాలని ప్రయత్నిస్తోంది. 2019–2020 మధ్య తమ స్టార్ క్యాంపెయినర్లు హెలికాప్టర్లలో ప్రయాణించడానికి విరాళాలు అందాయని ఈసీకి ఇచ్చిన అఫిడవిట్ లో మజ్లిస్ పేర్కొంది. ఒక్కో రైడ్ కు రూ.3 లక్షల చొప్పున నాలుగు రైడ్ లకు రూ.12 లక్షల విరాళాలు అందాయని తెలిపింది. మహ్మద్ నజీబుద్దీన్ ఖాన్, ఇంథిఖాబ్ అన్సారీ, ఝార్ఖండ్ కు చెందిన రియాజ్ షరీఫ్, ముంబైకి చెందిన అలావుద్దీన్ అన్సారీల హెలికాప్టర్ ప్రయాణాలకు విరాళాలు వచ్చాయని తెలిపింది.
ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ సీపీ, తెలుగు దేశం పార్టీలకు 2018–19తో పోలిస్తే బయటి నుంచి వచ్చిన విరాళాలు తగ్గాయి. వైఎస్ఆర్ సీపీకి రూ.8.9 కోట్ల మేర విరాళాలు వచ్చాయి. వైఎస్ఆర్ సీపీకి అత్యధికంగా జేఎస్ఆర్ ఇన్ ఫ్రా నుంచే రూ.రెండున్నర కోట్ల విరాళాలు అందాయి. నెల్లూరుకు చెందిన శివకుమార్ రెడ్డి అనే వ్యక్తి రూ. కోటి ఇచ్చారు. ఐబీ ఇన్ ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్, యునైటెడ్ టెలీ లింక్స్ వంటి సంస్థలూ తమ వంతు సాయం అందించాయి.
టీడీపీకి రూ.2.6 కోట్లే వచ్చాయి. టీడీపీకి ఎక్కువగా చెన్నైకి చెందిన ట్రయంఫ్ ఎలక్టోరల్ ట్రస్ట్ నుంచే విరాళాలు సమకూరాయి. ఈ ట్రస్ట్ కోటి రూపాయలు ఇచ్చింది. పబ్లిషర్ వేమూరి బలరామ్, ఆయన నడుపుతున్న అనిల్ స్వాతి బలరాం ఫౌండేషన్ కలిపి రూ.కోటి, జనచైతన్య హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ రూ.20 లక్షలు విరాళాలుగా ఇచ్చాయి. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబు తెలుగుదేశం పార్టీకి విరాళమిచ్చారు.