మరో పిడుగు.. లీటరు పాలపై రూ.12పెంపు..!
Milk prices may rise by RS 12 per litre from march 1.దేశంలో రోజు రోజుకు పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిపోతున్నాయి.
By తోట వంశీ కుమార్ Published on 25 Feb 2021 7:20 PM ISTదేశంలో రోజు రోజుకు పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిపోతున్నాయి. వీటితో పాటు వంటగ్యాస్, కూరగాయల ధరలతో సామాన్యుడు బెంబేలెత్తిపోతున్నాడు. ఇప్పుడు సామాన్యుడి నెత్తిన మరో పిడుగు పడనుంది. పెట్రోల్‌తో పోటీ పడుతూ డీజిల్ రేట్లు పెరుగుతోండటం వల్ల వాణిజ్యావసరాల కోసం వినియోగించే వాహనాలు కుదేల్ అవుతున్నాయి. నిత్యావసర సరుకులు, కూరగాయలు, పాలను రవాణా చేసే వాహనాలపై పెనుభారం మోపినట్టయింది. వాటి రవాణా ఖర్చు తడిసి మోపెడవుతోంది. దీంతో ఇదివరకు ఎన్నడూ లేనంతగా మార్చి 1 నుంచి లీటర్ పాల ధరపై రూ.12 చొప్పున పెంచాలని మధ్యప్రదేశ్‌లోని పాల ఉత్పత్తి సహకార సంఘాల ప్రతినిధులు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
ఈ మేరకు మధ్య ప్రదేశ్ ప్రభుత్వానికి ఓ వినతిపత్రాన్ని అందజేసినట్లు చెప్పారు. దీనికి ప్రభుత్వం ఆమోదించాల్సి ఉంది. దీనిపై పా ఉత్పత్తిదారుల సంఘం అధ్యక్షుడు పీరాలాల్ చౌదరి మాట్లాడుతూ.. దేశంలో పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల నేపథ్యంలో మంగళవారం 25 గ్రామాలకు చెందిన పాల ఉత్తత్పిదారులతో సమావేశమయ్యామని తెలిపారు. ఈ సమావేశంలో పాల ధరలను పెంచాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. గతేడాది రూ.2 పెంచాలని అనుకున్నా.. నగరంలో సరఫరాదారులతో అంగీకారం కుదరలేదని.. దానికి తోడు కరోనా సంక్షోభం రావడంతో పెంచలేదన్నారు. ఇప్పుడు పెట్రోల్, డీజిల్‌లకు తోడుగా పశు దాణా ధరలు పెరగడంతో.. పాల ధరలను పెంచుతున్నట్లు చెప్పారు. ప్రస్తుతం రూ.43గా ఉన్న ధరను రూ.55కు పెంచాలని నిర్ణయించినట్లు తెలిపారు.