జ‌మ్ము కశ్మీర్‌లో ఉగ్ర‌వాదుల దుశ్చ‌ర్య‌.. వలస కార్మికుడిని కాల్చిచంపారు

Migrant labourer from Bihar shot dead by terrorists in J&K's Bandipora.జ‌మ్ముక‌శ్మీరులో ఉగ్ర‌వాదులు దారుణానికి

By తోట‌ వంశీ కుమార్‌  Published on  12 Aug 2022 9:49 AM IST
జ‌మ్ము కశ్మీర్‌లో ఉగ్ర‌వాదుల దుశ్చ‌ర్య‌.. వలస కార్మికుడిని కాల్చిచంపారు

జ‌మ్ముక‌శ్మీరులో ఉగ్ర‌వాదులు దారుణానికి పాల్ప‌డ్డారు. ఓ వ‌ల‌స కార్మికుడిని కాల్చి చంపారు. బందిపోరా జిల్లాలోని సోద్నారా సుంబ‌ల్ ప్రాంతంలో బీహార్ రాష్ట్రంలోని మాదేపురాకు చెందిన వ‌ల‌స కూలీ మ‌హ్మ‌ద్ అమ్రేజ్‌పై టెర్ర‌రిస్టులు కాల్పుల‌కు పాల్ప‌డ్డారు. గురువారం అర్థ‌రాత్రి దాటిన త‌రువాత ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. స‌మాచారం అందుకున్న వెంట‌నే భ‌ద్ర‌తా బ‌ల‌గాలు ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్నాయి. తీవ్రంగా గాయ‌ప‌డిన అమ్రేజ్‌ను ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. చికిత్స పొందుతూ అత‌డు మృతి చెందిన‌ట్లు పోలీసులు తెలిపారు.

కాగా.. ఈ ఘ‌ట‌న‌కు పాల్ప‌డింది తామేన‌ని ఇప్ప‌టి వ‌ర‌కు ఏ ఉగ్ర సంస్థ ప్ర‌క‌టించ‌లేదు. గురువారం ఉదయం రాజౌరీలోని ఆర్మీ బేస్‌ క్యాంప్‌పై ముష్కరులు దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ ఘ‌ట‌న‌లో ముగ్గురు జ‌వాన్లు వీర‌మ‌ర‌ణం పొందారు. ఇద్ద‌రు ఉగ్ర‌వాదుల‌ను భ‌ద్ర‌తా బ‌ల‌గాలు మ‌ట్టుపెట్టాయి. స్వాత్రంత్య వేడుక‌లకు ముందు దేశంలో విధ్వంసం సృష్టించాల‌ని ఉగ్ర‌వాద సంస్థ‌లు ప్ర‌య‌త్నిస్తున్నాయి.

ఇటీవ‌ల వ‌ల‌స‌కూలీ, హిందువుల‌ను, స్థానికేత‌రుల‌ను టార్గెట్ చేస్తూ ఉగ్ర‌వాదులు దాడుల‌కు పాల్ప‌డుతున్నారు. గతంలో హిందూ పండిట్ రాహుల్ భ‌ట్, క‌శ్మీర్ టీవీ యాక్ట‌ర్ అమ్రీన్ భ‌ట్‌ను కాల్చి చంపారు. అయితే.. ఉగ్ర‌వాదుల‌ను భ‌ద్ర‌తా బ‌ల‌గాలు ఎన్‌కౌంట‌ర్ల‌లో హ‌త‌మారుస్తున్నాయి.

Next Story