దేశంలో మార్చి 31న నుంచి కొవిడ్ నిబంధనలు ఎత్తివేత.. మాస్క్ మాత్రం తప్పనిసరి
MHA ends COVID-19 containment measures from March 31.దేశంలో కరోనా మహమ్మారి అదుపులోకి వస్తోంది.
By తోట వంశీ కుమార్ Published on 23 March 2022 1:39 PM ISTదేశంలో కరోనా మహమ్మారి అదుపులోకి వస్తోంది. గత కొద్ది రోజులుగా దేశ వ్యాప్తంగా రెండు వేల లోపు మాత్రమే రోజువారి పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో బుధవారం కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల (మార్చి) 31 నుంచి కొవిడ్ నిబంధనలను పూర్తిగా ఎత్తివేస్తున్నట్లు తెలిపింది. అయితే.. మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటి నిబంధనలు మాత్రం యధావిధిగా కొనసాగుతాయని చెప్పింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు హోం శాఖ కార్యదర్శి సమాచారం ఇచ్చారు.
కాగా.. రెండేళ్ల క్రితం దేశంలో కరోనా మహమ్మారి విజృంభించడంతో ఈ మహమ్మారిని నియంత్రించేందుకు విపత్తు నిర్వహణ చట్టం కింద మార్చి 24, 2020న కొవిడ్ నిబంధనలను తెచ్చిన సంగతి తెలిసిందే. ఆ తరువాత కేసుల సంఖ్యను బట్టి నిబంధనల్లో మార్పులు, చేర్పులు చేస్తూ వస్తున్నారు. కాగా.. గత ఏడు వారాలుగా దేశంలో కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టడంతో నిబంధనలను పూర్తిగా ఎత్తివేయాలని హోం మంత్రిత్వ శాఖ నిర్ణయించింది.
కరోనా పరిస్థితుల్లో మెరుగుదలతో పాటు వైరస్‌ను ఎదుర్కొనడానికి ప్రభుత్వం సంసిద్ధంగా ఉందని కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా రాష్ట్రాలకు పంపిన ఉత్తర్వుల్లో తెలిపారు. కేంద్రపాలిత ప్రాంతాలు, రాష్ట్రాలు తమ సామర్థ్యాన్ని పెంచుకుని సొంత వ్యవస్థలను ఏర్పాటు చేసుకున్నాయన్నారు. కేసులు కూడా తగ్గుముఖం పట్టడంతో అన్ని అంశాలను పరిగనలోకి తీసుకున్న తరువాత జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ఓ నిర్ణయం తీసుకుందన్నారు.
కరోనా కట్టడికి విపత్తు నిర్వహణ చట్టం కింద ఉన్న నిబంధనలు మరింతకాలం పొడిగించాల్సిన అవసరం లేదని బావిస్తున్నట్లు చెప్పారు. మార్చి 31తో ప్రస్తుతం ఉన్న ఆంక్షల గడువు ముగిస్తుందని.. ఆ తరువాత హోంశాఖ ఎలాంటి కొత్త ఆదేశాలు జారీ చేయబోదన్నారు. అయితే.. ప్రజలంతా మాస్క్ ధరించడంతో పాటు భౌతిక దూరం పాటించాలన్నారు. ఒకవేళ కేసుల సంఖ్య పెరిగే.. స్థానిక ప్రభుత్వాలు తిరిగి నిబంధనలు విధించే అంశాన్ని పరిశీలించవచ్చునని చెప్పారు.