మేఘాలయ గవర్నర్ సత్యపాల్ మాలిక్ రైతులకు మద్దతుగా మాట్లాడి ప్రభుత్వానికి షాక్ ఇచ్చారు. ప్రధాని మోదీ, కేంద్ర హోంమత్రి అమిత్ షాలు రైతులను అడ్డుకునే ప్రయత్నం చేయకూడదని.. రైతుల పంటకు కనీస మద్దతు ధరను చట్ట ప్రకారం ప్రకటిస్తే వారు ఆందోళనలను విరమిస్తారని చెప్పారు. రైతుల ఉద్యమాన్ని అణచివేసేందుకు బలగాలను ఉపయోగించరాదని అన్నారు. రైతులను అనుకూలంగా మన దేశంలో ఎలాంటి చట్టాలు లేవని.. ఏ దేశంలో అయితే రైతులు, జవాన్లు అంసంతృప్తితో ఉంటారో ఆ దేశం ఎప్పటికీ అభివృద్ది చెందలేదని అన్నారు. రైతులు, జవాన్లు తృప్తిగా ఉండేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉందని అన్నారు. రైతులు రోజురోజుకు పేదలుగా మారుతున్నారని, ఇదే సమయంలో ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి ప్రభుత్వ అధికారులు, సిబ్బంది జీత భత్యాలు పెరుగుతున్నాయని అన్నారు. రైతు కొనే వస్తువులు ఖరీదుగా ఉంటున్నాయని.. తాము పేదలుగా ఎందుకు మారుతున్నామో కూడా రైతులకు అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
పండించిన పంటను ఎక్కడైనా అమ్ముకోవచ్చని చెపుతున్నారని ఇది 15 ఏళ్ల నాటి చట్టమని కొత్త వ్యవసాయ చట్టాలపై సత్యపాల్ మాలిక్ అన్నారు. రైతులు తమ పంటను తీసుకునుని వేరే ప్రాంతానికి వెళ్లినప్పుడు వారిపై లాఠీఛార్జిలు జరిగిన సందర్బాలు కూడా ఉన్నాయని.. రైతులు అడుగుతున్న పలు ప్రశ్నలకు మనం సమాధానాలు చెప్పాల్సి ఉందని అన్నారు. రైతులకు అనుకూలంగా ఒక్క చట్టం కూడా లేదని ఆవేదన వ్యక్తం చేశారు.