అర్ధరాత్రి పెట్రోల్ కోసం పరుగులు..చెన్నైలోని బంకుల వద్ద భారీ క్యూలు
పెట్రోల్ ధరలు భారీగా పెరుగుతాయని మరియు బంకులు మూతపడతాయనే పుకార్లు చెన్నై నగరాన్ని కుదిపేశాయి.
By - Knakam Karthik |
అర్ధరాత్రి పెట్రోల్ కోసం పరుగులు..చెన్నైలోని బంకుల వద్ద భారీ క్యూలు
మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయనే వార్తల నేపథ్యంలో, పెట్రోల్ ధరలు భారీగా పెరుగుతాయని మరియు బంకులు మూతపడతాయనే పుకార్లు చెన్నై నగరాన్ని కుదిపేశాయి. బుధవారం అర్ధరాత్రి నుంచే చెన్నై శివార్లతో పాటు తాంబరం, మధురాంతకం, ఓల్డ్ మహాబలిపురం రోడ్ (OMR), ఈస్ట్ కోస్ట్ రోడ్ (ECR) వంటి ప్రధాన ప్రాంతాల్లోని పెట్రోల్ బంకుల వద్ద ప్రజలు భారీగా క్యూ కట్టారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ తప్పుడు వార్తల వల్ల ఆందోళన చెందిన జనం, నిద్రలు మానుకుని మరీ వాహనాలతో బంకులకు పరుగులు తీశారు.
కేవలం వాహనాల్లో ట్యాంకులు నింపుకోవడమే కాకుండా, భవిష్యత్తు అవసరాల కోసం ప్లాస్టిక్ బాటిళ్లు, పెద్ద నీటి డబ్బాల్లో కూడా ఇంధనాన్ని నింపుకోవడానికి ప్రయత్నించారు. నిజానికి భద్రతా కారణాల దృష్ట్యా డబ్బాల్లో పెట్రోల్ పోయకూడదనే నిబంధన ఉన్నప్పటికీ, జనం రద్దీని మరియు వారి ఆందోళనను చూసి కొన్ని చోట్ల నిర్వాహకులు ఏమీ చేయలేకపోయారు. మరికొన్ని చోట్ల నిబంధనల ప్రకారం డబ్బాల్లో పోయడానికి నిరాకరించిన సిబ్బందితో ప్రజలు గొడవకు దిగడం ఉద్రిక్తతలకు దారితీసింది. ఆఫీసుల నుండి ఇళ్లకు వెళ్తున్న వారు సైతం భోజనానికి వెళ్లకుండా గంటల తరబడి లైన్లలో వేచి ఉన్నారు.
ఈ భయాందోళనల (Panic Buying) ప్రభావంతో చాలా బంకుల్లో స్టాక్ ఒక్కసారిగా అయిపోయింది, దీంతో గురువారం మధ్యాహ్నానికే అనేక బంకులు బోర్డులు పెట్టాల్సి వచ్చింది. స్టాక్ లేక బంకులు మూసివేయడంతో ప్రజలు మరింత ఆందోళనకు గురై ఒక బంక్ నుండి మరో బంక్‌కు పరుగులు తీశారు. అయితే ప్రభుత్వం కానీ, చమురు సంస్థలు కానీ ధరల పెంపుపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదని అధికారులు స్పష్టం చేశారు. ఈ అనవసర భయాందోళనలను సృష్టించి, తప్పుడు పుకార్లు వ్యాప్తి చేసిన వ్యక్తులను గుర్తించేందుకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రజలు ఇలాంటి నిరాధారమైన వార్తలను నమ్మి ఆందోళన చెందవద్దని కోరారు.