ముంబైలో భారీ అగ్నిప్ర‌మాదం.. క‌మ‌లాబిల్డింగ్‌లోని 18వ‌ అంత‌స్తులో ఎగిసిన మంట‌లు.. ఇద్ద‌రు మృతి

Massive Fire Breaks Out At Mumbai High Rise 2 Dead.మ‌హారాష్ట్ర రాజ‌ధాని ముంబై న‌గ‌రంలో భారీ అగ్నిప్ర‌మాదం జ‌రిగింది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  22 Jan 2022 10:35 AM IST
ముంబైలో భారీ అగ్నిప్ర‌మాదం.. క‌మ‌లాబిల్డింగ్‌లోని 18వ‌ అంత‌స్తులో ఎగిసిన మంట‌లు.. ఇద్ద‌రు మృతి

మ‌హారాష్ట్ర రాజ‌ధాని ముంబై న‌గ‌రంలో భారీ అగ్నిప్ర‌మాదం జ‌రిగింది. సెంట్ర‌ల్ ముంబైలోని తాడ్‌దేవ్ ప్రాంతంలోని ఓ 20 అంత‌స్తుల భ‌వ‌నంలో శనివారం ఉద‌యం చోటు చేసుకున్న ఈ ప్ర‌మాదంలో ఇద్ద‌రు మృతి చెంద‌గా.. ప‌లువురు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. పోలీసులు తెలిపిన వివ‌రాల మేర‌కు.. బృహ‌త్ ముంబై మున్సిప‌ల్ కార్పొరేష‌న్‌(బీఎంసీ) ప‌రిధిలోని భాటియా ఆస్ప‌త్రికి ఎదురుగా 20 అంత‌స్తుల క‌మ‌లా భ‌వ‌నం ఉంది. ఈ భ‌వ‌నంలోని 18వ అంత‌స్తులో శ‌నివారం ఉద‌యం ఏడున్న‌ర గంటల ప్రాంతంలో ఒక్క‌సారిగా మంట‌లు చెల‌రేగాయి.

గ‌మ‌నించిన స్థానికులు వెంట‌నే అధికారులు, అగ్నిమాప‌క సిబ్బందికి స‌మాచారం ఇచ్చారు. 13 ఫైరింజ‌న్లు, 5 అంబులెన్స్‌లు ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్నాయి. అగ్నిమాప‌క సిబ్బంది మంట‌ల‌ను ఆర్పేందుకు తీవ్రంగా శ్ర‌మిస్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఇద్ద‌రు ప్రాణాలు కోల్పోగా.. మ‌రో 15 మంది తీవ్రంగా గాయ‌ప‌డిన‌ట్లు అధికారులు తెలిపారు. వారిని ఆస్ప‌త్రికి త‌ర‌లించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో ముగ్గురు పరిస్థితి విష‌మంగా ఉన్న‌ట్లు వైద్యులు తెలిపారు. పెద్ద ఎత్తున మంట‌లు చెల‌రేగ‌డంతో భారీ ఎత్తున ద‌ట్ట‌మైన పొగ అలుముకుంది. ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌గా భ‌వనంలో ఉన్న వారిని పోలీసులు ఖాళీ చేయించారు. అగ్నిప్ర‌మాదానికి గ‌ల కార‌ణాలు ఇంకా తెలియ‌రాలేదు. దీనిపై కేసు న‌మోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

ప్ర‌మాదస్థ‌లిని ప‌రిశీలించిన ఎమ్మెల్యే, మేయ‌ర్‌..

ఘ‌ట‌న జ‌రిగిన క‌మ‌లా బిల్డింగ్‌ను బీజేపీ ఎమ్మెల్యే మంగ‌ల్ ప్ర‌భాత్ లోధా, ముంబై మేయ‌ర్ కిశోరి ఫ‌డ్నేక‌ర్ ప‌రిశీలించారు. ద‌ట్ట‌మైన పొగ క‌మ్ముకోవ‌డంతో ముందు జాగ్ర‌త్తగా అంద‌రిని ఖాళీ చేయించిన‌ట్లు తెలిపారు. క్ష‌త‌గాత్రుల‌కు మెరుగైన చికిత్స అందించాల‌ని అధికారుల‌కు ఆదేశించారు.


Next Story