అస్సాంలో భారీ అగ్నిప్ర‌మాదం.. 150 దుకాణాలు దగ్ధం

Massive Fire At Assam Market 150 Shops Destroyed.అస్సాం రాష్ట్రంలో భారీ అగ్నిప్ర‌మాదం చోటు చేసుకుంది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  17 Feb 2023 9:21 AM IST
అస్సాంలో భారీ అగ్నిప్ర‌మాదం.. 150 దుకాణాలు దగ్ధం

అస్సాం రాష్ట్రంలో భారీ అగ్నిప్ర‌మాదం చోటు చేసుకుంది. జోర్హాట్‌లోని చౌక్ బ‌జార్‌లోని ఓ బ‌ట్ట‌ల దుకాణంలో గురువారం అర్థ‌రాత్రి తొలుత మంట‌లు చెల‌రేగాయి. బ‌ట్ట‌ల షాపు కావ‌డంతో వేగంగా మంట‌లు వ్యాపించాయి. క్ష‌ణాల్లో ప‌క్క‌నే ఉన్న దుకాణాల‌కు సైతం మంట‌లు అంటుకున్నాయి. ఉవ్వెత్తున మంట‌లు ఎగిసిప‌డ్డాయి. ఆ ప్రాంతం మొత్తం ద‌ట్ట‌మైన పొగ అలుముకుంది.

స‌మాచారం అందుకున్న వెంట‌నే అగ్నిమాప‌క సిబ్బంది అక్క‌డ‌కు చేరుకున్నారు. 25 ఫైరింజ‌న్ల సాయంతో చాలా సేపు శ్ర‌మించి మంట‌ల‌ను అదుపులోకి తీసుకువ‌చ్చారు. అయితే.. అప్ప‌టికే 150 పైగా దుకాణాలు అగ్నికి ఆహుతి అయ్యాయి. విద్యుత్ షార్ట్ స‌ర్య్కూట్ కార‌ణంగానే మంట‌లు చెల‌రేగిన‌ట్లు బావిస్తున్నారు. ఈ ప్ర‌మాదంలో భారీగా ఆస్తి న‌ష్టం జ‌రిగిన‌ట్లు తెలుస్తుండ‌గా.. ఎవ్వ‌రికి ఎటువంటి గాయాలు కాక‌పోవ‌డంతో అంద‌రూ ఊపిరిపీల్చుకున్నారు.

షాపులు మూసివేసిన త‌రువాత ప్ర‌మాదం జ‌ర‌గ‌డంతో ఎలాంటి ప్రాణ న‌ష్టం జ‌ర‌గ‌లేద‌ని అధికారులు తెలిపారు. మంట‌ల‌ను అదుపుచేసేందుకు జోర్హాట్ స‌మీపంలో ఉన్న ప‌ట్ట‌ణాల నుంచి ఫైరింజ‌న్లు తెప్పించిన‌ట్లు చెప్పారు. అయితే.. రోడ్లు ఇరుకుగా ఉండ‌డంతో ఫైరింజ‌న్లు అక్క‌డ‌కు చేరుకునేందుకు స‌మయం ప‌ట్టింద‌న్నారు. ఇక ద‌గ్థ‌మైన దుకాణాల్లో ఎక్క‌వుగా బ‌ట్ట‌లు, నిత్యావ‌స‌రాల‌కు చెందిన షాపులే ఉన్నాయ‌ని తెలిపారు.

Next Story