పంజాబ్ ప్రభుత్వం అక్కడి ప్రజలకు శుభవార్త చెప్పింది. ప్రతి ఇంటికి జూలై 1వ తేదీ నుంచి 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ను ఇవ్వనున్నట్లు ప్రకటించింది. భగవంత్ మాన్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్‌లో అధికారం చేపట్టి నేటికి సరిగ్గా నెలరోజులు అయిన సందర్భంగా ఈ తీపి కబురును ప్రజలకు అందించింది.
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రతి ఇంటికి 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తామని హామీ ఇచ్చింది. దేశ రాజధాని ఢిల్లీలో 200 వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని, పంజాబ్‌లో అధికారంలోకి వస్తే ఇక్కడ కూడా ఉచిత విద్యుత్‌ను అందిస్తామని ఆసమయంలో ఆమ్ ఆద్మీ పార్టీ తెలిపింది. ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభంజనం సృష్టించింది. మొత్తం 117 అసెంబ్లీ స్థానాలకు గానూ 92 చోట్ల విజయకేతనం వేసింది. మార్చి 16న సీఎంగా భగవంత్ మాన్ ప్రమాణ స్వీకారం చేశారు.
పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం కొలువుదీరినప్పటి నుంచి ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేస్తుంది. ఇప్పటికే ఇంటింటికీ రేషన్ సరఫరా హామీని ఆప్ సర్కార్ అమలు చేస్తోంది. అలాగే 25 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది.