భారత మాజీ ప్రధాని, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు డాక్టర్ మన్మోహన్ సింగ్ కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. సోమవారం నిర్వహించిన కరోనా నిర్ధారణ పరీక్షలో ఆయనకు పాజిటివ్ రావడంతో చికిత్స నిమిత్తం ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ (ఐయిమ్స్)లో చేరారు. 88 ఏళ్ల మన్మోహన్ సింగ్ ప్రస్తుతం హృద్రోగ సమస్యలతో బాధపడుతున్నారు. వయోభారం, ఇతర అనారోగ్య సమస్యల దృష్ట్యా వైద్యులు ఆయన ఆరోగ్య పరిస్థితి ఎప్పటికప్పుడు నిశితంగా పరిశీలిస్తున్నారు.
ఇదిలావుంటే.. మన్మోహన్ సింగ్ దేశంలో కరోనా పరిస్థితులపై ఆదివారమే ప్రధాని మోదీకి లేఖ రాశారు. కొవిడ్-19 వ్యాక్సిన్ కోసం ప్రభుత్వం ఇచ్చిన అన్ని ఆర్డర్ల వివరాలను బహిర్గతం చేయాలని కోరారు. కొవిడ్ నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై కేంద్ర ప్రభుత్వానికి పలు సలహాలను సైతం సూచించారు. ఆయన కూడా కరోనా బారిన పడటంతో కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనకు గురవుతున్నారు.