మణిపూర్‌లో చల్లారని హింస.. కేంద్రమంత్రి ఇల్లు దహనం
ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో హింసాకాండ కొనసాగుతోంది. రెండు వర్గాల మధ్య చెలరేగిన ఘర్షణలు ఇప్పటికీ చల్లారడం లేదు.
By Srikanth Gundamalla Published on 16 Jun 2023 12:26 PM GMTమణిపూర్‌లో చల్లారని హింస.. కేంద్రమంత్రి ఇల్లు దహనం
ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో హింసాకాండ కొనసాగుతోంది. రెండు వర్గాల మధ్య చెలరేగిన ఘర్షణలు ఇప్పటికీ చల్లారడం లేదు. నెల రోజులు దాటినా కానీ మణిపూర్‌లోని పరిస్థితులు ఇంకా అదుపులోకి రాలేదు. తాజాగా మరోసారి కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి ఆర్‌కే రంజన్ సింగ్ ఇంటిపై వెయ్యి మందికిపైగా నిరసనకారులు దాడి చేశారు. విధ్వంసం సృష్టించి.. ఆ తర్వాత పెట్రోల్ బాంబులు విసిరారు. అయితే.. దాడి సమయంలో కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి ఆర్‌కే రంజన్ ఇంట్లో లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.
మణిపూర్‌లో మెయిటీ తెగవారు తమను షెడ్యూల్డు తెగల జాబితాలో చేర్చాలని డిమాండ్ చేస్తున్నారు. మే 3న నిర్వహించిన 'గిరిజన సంఘీభావ యాత్ర' తర్వాత ఘర్షణలు చెలరేగాయి. అప్పటి నుంచి వరుసగా దాడి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇంఫాల్‌లో కర్ఫ్యూ కొనసాగుతోంది. అయినా కూడా కొందరు ఆందోళనకారులు జూన్ 15న కొంగ్బాలోని రంజన్‌సింగ్ ఇంటిపై దాడికి తెగబడ్డారు. ఆ సమయంలో ఇంట్లో మంత్రి లేకపోయినా.. తొమ్మిది మంది ఎస్కార్ట్ సిబ్బంది, ఐదుగురు సెక్యూరిటీ గార్డ్స్, 8 మంది అడిషనల్ గార్డ్స్ విధుల్లో ఉన్నట్లు అధికారులు తెలిపారు. మంత్రి ఇంటిపై దాడి తర్వాత పెట్రోల్ బాంబులు విసిరారు. దాంతో.. రెండు ఇళ్లను దగ్దమయ్యాయని తెలిపారు.. ఇక అంతకుముందు రోజు బుధవారం భద్రతా దళాలు, నిరసనకారుల మధ్య జరిగిన ఘర్షణల్లో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు, 10 మంది గాయపడ్డారు. అయితే..తాజాగా మంత్రి ఇంటిపై జరిగిన ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని చెప్పారు అధికారులు. నిరసనకారులు పెద్ద సంఖ్యలో ఉండటం వల్ల భద్రతా సిబ్బంది వారిని అడ్డుకునే ప్రయత్నం చేసినా సఫలం కాలేకపోయారని చెప్పారు.
కేంద్ర విదేశాఖ శాఖ సహాయ మంత్రి ఇంటిపై దాడి జరగడం ఇది రెండోసారి. మే నెలలో కూడా రంజన్ సింగ్ ఇంటిపై దాడి జరిగింది. అప్పుడు దాడి చేసేందుకు వచ్చిన నిరసనకారులను భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. గాల్లోకి కాల్పులు జరిపి చెల్లాచెదురు చేశారు.
జాతిహింసను చల్లార్చేందుకు తమ వంతు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నట్లు చెప్పారు కేంద్ర విదేశాంగ శాఖ సహాయమంత్రి ఆర్‌కే రంజన్ సింగ్. ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసిందని, శాంతి చర్చల ప్రక్రియ కొనసాగుతుందని పేర్కొన్నారు. శాంతి స్థాపనకు అందరూ కలిసి రావాలని కోరారు. ప్రస్తుతం కొచ్చిలో ఉన్న రంజన్ సింగ్.. అన్ని కార్యక్రమాలు రద్దు చేసుకున్నారు. కష్టపడి సంపాదించి ఇల్లు కట్టుకున్నానని.. అవినీతికి పాల్పడలేదని చెప్పారు. తానూ ఒక హిందువునేనని.. దాడిచేసిన వారు హిందువులే కాబట్టి మతపరమైన దాడి కాదని రంజన్ సింగ్ అభిప్రాయపడ్డారు.
ఇక ఇదే ఘటనపై స్పందించిన మణిపూర్ సీఎం ఎన్ బీరెన్ సింగ్.. తాము చర్చలు జరుపుతున్నట్లు చెప్పారు. ఖమెన్‌లోక్ ప్రాంతంలో తొమ్మిది మందిని హత్య చేయడాన్ని ఆయన ఖండించారు. హింసాకాండకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. హింసాత్మక ఘటనలకు పాల్పడుతున్న వారిని గుర్తించి.. తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు సీఎం ఎన్ బీరెన్ సింగ్.