విరిగిప‌డిన కొండ‌చ‌రియ‌లు.. 14కు చేరిన మృతులు.. కొన‌సాగుతున్న స‌హాయక చ‌ర్య‌లు

Manipur landslide 14 dead.నోనీ జిల్లాలోని ఇంఫాల్‌-జిరిబామ్‌ మధ్య కొత్త రైల్వే లైన్‌ నిర్మాణ పనులు జరుగుతున్నాయి.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  1 July 2022 12:29 PM IST
విరిగిప‌డిన కొండ‌చ‌రియ‌లు.. 14కు చేరిన మృతులు.. కొన‌సాగుతున్న స‌హాయక చ‌ర్య‌లు

నోనీ జిల్లాలోని ఇంఫాల్‌-జిరిబామ్‌ మధ్య కొత్త రైల్వే లైన్‌ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. తుపుల్‌ యార్డ్ వ‌ద్ద బుధవారం రాత్రి ఒక్కసారిగా కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో 14 మంది ప్రాణాలు కోల్పోగా, 23 మందిని ర‌క్షించిన‌ట్లు సైన్యం తెలిపింది. మణిపూర్‌ డీజీపీ డౌంగెల్ మాట్లాడుతూ.. శిథిలాల కింద ఎంత మంది చిక్కుకుపోయారనే విషయమై ఇంకా స్పష్టత లేదన్నారు. సుమారు 60 మంది వరకు శిథిలాల కింద ఉండవచ్చని అంచనా వేస్తున్న‌ట్లు తెలిపారు. వారిలో ఆర్మీ, రైల్వే అధికారులు, కూలీలు, గ్రామస్థులు ఉన్నారని వెల్లడించారు. మృతుల్లో ఏడుగురు టెరిటోరియల్‌ ఆర్మీ జవాన్లని చెప్పారు.

మరోవైపు.. కొండచరియలు విరిగి ఎజెయ్ నదికి అడ్డంగా పడడంతో నదీ ప్రవాహం ఆగిపోయినట్టు అధికారులు తెలిపారు. దీంతో లోతట్టు ప్రాంతాలు మునిగిపోయే ప్రమాదం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.

ప్ర‌మాద స‌మాచారం అందుకున్న వెంటనే ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్నారు. సహాయక చర్యలను పర్యవేక్షించారు. మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షలు, క్షతగాత్రులకు రూ. 50 వేల ఎక్స్‌గ్రేషియా ప్ర‌క‌టించారు. ఈ ఘ‌ట‌న‌పై రాష్ట్ర‌ప‌తి రామ్ నాథ్ కోవింద్‌, ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ దిగ్భ్రాంతిని వ్య‌క్తం చేశారు.

Next Story