రెండోసారి త్రిపుర సీఎంగా మాణిక్ సాహా ప్రమాణం
త్రిపుర ముఖ్యమంత్రిగా మాణిక్ సాహా రెండోసారి ప్రమాణ స్వీకారం చేశారు.
By తోట వంశీ కుమార్ Published on 8 March 2023 1:12 PM IST
త్రిపుర ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తున్న మాణిక్ సాహా
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడంతో త్రిపుర ముఖ్యమంత్రిగా మాణిక్ సాహా రెండోసారి ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు మరో 8 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. అగర్తలాలో జరిగిన ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ చీఫ్ జేపీ నడ్డా హాజరయ్యారు. వారితో పాటు అస్సాం ముఖ్యమంత్రి మరియు బిజెపి ఈశాన్య విజయాల రూపశిల్పి హిమంత బిస్వా శర్మ కూడా ఉన్నారు.
మంత్రులుగా ప్రమాణం చేసిన వారిలో శాంతనా ఛక్మా, సుశాంతా చౌధురి, రతన్ లాల్ నాథ్, టింకూ రాయ్, బిక్ష్ దెబ్బర్మా, ప్రాణ్‌జిత్ సింఘరాయ్, సుధాంగ్షూ దాస్, సుక్లా చరణ్ నౌటియా ఉన్నారు. ఫిబ్రవరి 16న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 60 స్థానాలున్న త్రిపుర అసెంబ్లీలో బీజేపీ 32 సీట్లను సొంతం చేసుకుంది. మిత్రపక్షం ఐపీఎఫ్‌టీ పార్టీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.
BJP's Prof.(Dr.) Manik Saha takes oath as the Chief Minister of Tripura, in Agartala
— ANI (@ANI) March 8, 2023
(Pic: DD) pic.twitter.com/g4zwBfbkWj
కమ్యూనిస్టులకు కంచుకోటైన త్రిపురలో తొలిసారిగా 1988లో కాంగ్రెస్-టీయూజేఎస్ కూటమి అధికారంలోకి వచ్చింది. 1996లో మళ్లీ కమ్యూనిస్టులు అధికారంలోకి వచ్చారు. కమ్యూనిస్టుల జైత్రయాత్రకు గత ఎన్నికల్లో మాణిక్ సాహా బ్రేక్ వేశారు. తాజాగా జరిగిన ఎన్నికల్లోనూ మరోసారి పార్టీని అధికారంలోకి తీసుకువచ్చారు.