ఇంట్లో ఇల్లాలు.. ప్రియురాలితో మాల్దీవుల్లో షికార్లు.. కథలో సూపర్ ట్విస్ట్
Man Tears Out Passport Pages To Hide Foreign Trip From Wife.అతడో ప్రముఖ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా
By తోట వంశీ కుమార్ Published on 10 July 2022 9:04 AM ISTఅతడో ప్రముఖ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. ఆఫీస్ పనిమీద విదేశాలకు వెలుతున్నానని భార్యతో చెప్పి తన ప్రియురాలితో కలిసి మాల్దీవుల్లో షికార్లు చేశాడు. అయితే.. భార్యకు తాను మాల్దీవులకు వెళ్లిన విషయం తెలియకుండా ఉండేందుకు తన పాస్‌పోర్టులో కొన్ని పేజీలను చించేశాడు. దీంతో పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు.
వివరాల్లోకి వెళితే.. ముంబైకి చెందిన 32 ఏళ్ల వ్యక్తి ఓ ప్రముఖ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజినీరుగా పనిచేస్తున్నాడు. ఆఫీస్ పని నిమిత్తం విదేశాలకు వెలుతున్నానని భార్యకు చెప్పి ప్రియురాలిని తీసుకుని మాల్దీవులకు వెళ్లాడు. అయితే.. అతడి భార్య ఎన్నిసార్లు ఫోన్ చేసినా అతడు స్పందించలేదు. చివరకు వాట్సాప్‌లో కాల్ చేసినా ఎత్తలేదు. తాను ఫోన్ ఎత్తకపోవడంతో తన భార్యకు అనుమానం ఏమైనా వచ్చిందేమోనని అతడు భయపడ్డాడు.
తన మాల్దీవుల విషయం బయటకు రాకుండా ఉండేందుకు అతడో ఉపాయాన్ని ఆలోచించారు. తన పాస్‌పోర్టులోని స్టాంప్ పేజీలను చించేశాడు. అలాగే మాల్దీవుల నుంచి ముంబైకి చేరుకున్నాడు. అయితే.. ఇమ్మిగ్రేషన్ అధికారులు అతడి పాస్‌పోర్టులో 3 నుంచి 6, 31 నుంచి 34 పేజీలు మిస్అయినట్లు గుర్తించారు. ఈ విషయంపై అతడిని అడుగగా పొంతన లేని సమాధానాలు చెప్పడంతో అతడిని పోలీసులకు అప్పగించారు.
అతడు కావాలనే పాస్‌పోస్టులోని పేజీలను చించేసి మాల్దీవుల నుంచి భారత్‌కు చేరుకుని మోసపూరిత నేరానికి పాల్పడ్డాని ఇమ్మిగ్రేషన్ అధికారి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసుల విచారణలో అతడు నిజం ఒప్పుకున్నాడు. తన ప్రియురాలితో కలిసి వెళ్లిన విషయాన్ని దాచేందుకు ఇలా చేసినట్లు తెలిపాడు. అయితే పాస్‌పోర్ట్‌ను ట్యాంపరింగ్ చేయడం నేరమని అతనికి తెలియదని పోలీసు అధికారి తెలిపారు. అతడిని జైలుకు తరలించినట్లు పోలీసులు తెలిపారు.