మధ్యప్రదేశ్‌లోని సత్నాలోని సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ జిల్లా ఆసుపత్రిలో శనివారం ఓ వ్యక్తి తన తాతను మోటార్‌సైకిల్‌పై నేరుగా ఎమర్జెన్సీ వార్డులోకి తీసుకురావడం కలకలం రేపింది. ఆ వ్యక్తి ఆసుపత్రిలో అవుట్‌సోర్సింగ్ ఉద్యోగి, రోగి చార్ట్‌లను తయారు చేసే విధులు నిర్వర్తిస్తుంటాడు. జిల్లాలోని తికురియా తోలా నివాసి దీపక్ గుప్తా తన తాత మోతీ లాల్ గుప్తాతో కలిసి తన మోటార్‌సైకిల్‌ను నేరుగా ఆసుపత్రిలోని అత్యవసర వార్డులోకి మరొక వ్యక్తితో కలిసి తీసుకువచ్చాడు. వెనుక కూర్చొన్న వ్యక్తి అక్కడి సిబ్బంది కలిసి అచేతనంగా ఉన్న ఆ వృద్ధుడ్ని బైక్ నుంచి కిందకు దించారు. అనంతరం అత్యవసర వైద్యం అందించారు.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆసుపత్రిలో స్ట్రెచర్లు, ఇతర సౌకర్యాలు ఉన్నప్పటికీ, అతడి చర్యలు ఇప్పుడు చర్చనీయాంశమవుతున్నాయి. ఈ విషయంపై ఆస్పత్రి యాజమాన్యం మౌనం వహించింది. ఆసుపత్రి ప్రాంతీయ వైద్యాధికారి శరద్ దూబే మాట్లాడుతూ.. "ఒక గార్డు ఈ సంఘటన గురించి నిన్న నాకు తెలియజేశాడు. అతను ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి అయినందున, నేను సోమవారం చర్యల గురించి అతని యజమాని నుండి ప్రతిస్పందనను కోరతాను" అని అన్నారు. "అతడు తొందరపడి ఇలా చేయలేదని నేను అనుకుంటున్నాను" అని అతను చెప్పాడు. ఎనిమిది స్ట్రెచర్లు, ఆరు పని చేసే వీల్‌చైర్లు అన్ని సమయాల్లో ఆసుపత్రిలో అందుబాటులో ఉన్నాయని దూబే తెలిపారు.