భారతదేశం కరోనా మహమ్మారితో పోరాడుతూ ఉన్న సంగతి తెలిసిందే..! ఎన్నో ఘటనలు మనకు కంటతడి పెట్టిస్తూ ఉన్నాయి. కరోనా మహమ్మారి కారణంగా ఒంటరైపోయిన జీవితాలు.. అనాథల్లా మారిపోయిన పిల్లలు.. కుటుంబంలో ఒక్కరు కూడా మిగలకుండా ఉండడం.. ఇలా చాలా ఘటనలు మన చుట్టూ చోటు చేసుకుంటూ ఉన్నాయి.
తాజాగా మరో బాధాకరమైన ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. పెద్ద కొడుకు అంత్యక్రియలు చేసొచ్చే సమయానికే చిన్న కొడుకు కూడా మరణించడంతో ఆ తండ్రి బాధ వర్ణనాతీతం. 24 గంటల వ్యవధిలో ఇద్దరు కొడుకులను పోగొట్టుకున్న ఘటన గ్రేటర్ నోయిడాలో మంగళవారం చోటు చేసుకుంది.
తీవ్రమైన జ్వరంతో చనిపోయిన తన పెద్ద కొడుకు పంకజ్ కు జలాల్ పూర్ గ్రామానికి చెందిన అతర్ సింగ్ అంత్యక్రియలు చేశాడు. ఆ తర్వాత ఇంటికి తిరిగొచ్చాక చిన్న కొడుకు దీపక్ కూడా చనిపోయి ఉన్నాడు. ఇద్దరు పిల్లలను ఒకేసారి కోల్పోవడంతో అతర్ సింగ్ భార్య కన్నీరుమున్నీరైంది. వారిద్దరికీ కరోనా టెస్టులు చేయకపోవడంతో కరోనాతోనే చనిపోయారా? లేక మామూలు మరణాలా? అనేదానిపై స్పష్టత లేదు.
జలాల్ పూర్ గ్రామంలో గత 14 రోజుల్లో 18 మంది చనిపోయారట..! తొలుత ఏప్రిల్ 28న రుషీ సింగ్ అనే యువకుడు జ్వరంతో చనిపోయాడని, ఆ తర్వాత అతడి కుమారుడు మరణించాడని చెప్పారు. చనిపోయినవారందరూ ముందు జ్వరంతో బాధపడ్డారని, ఆ తర్వాత ఆక్సిజన్ స్థాయులు తగ్గిపోయాయని అన్నారు. వరుసగా గ్రామస్థులు చనిపోతూ ఉండడంతో ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతూ ఉన్నారు.