లిఫ్ట్‌లో ఇరుక్కుపోయిన వ్య‌క్తి.. రక్షించిన సెక్యూరిటీ గార్డుకు చెంప‌దెబ్బ‌లు..వీడియో

Man Rescued From Lift In Gurgaon Repeatedly Slaps Liftman.ఇటీవ‌ల కాలంలో చిన్న‌స్థాయిలో ఉన్న ఉద్యోగులను కొంత మంది చిన్న

By తోట‌ వంశీ కుమార్‌  Published on  30 Aug 2022 12:03 PM IST
లిఫ్ట్‌లో ఇరుక్కుపోయిన వ్య‌క్తి.. రక్షించిన సెక్యూరిటీ గార్డుకు చెంప‌దెబ్బ‌లు..వీడియో

ఇటీవ‌ల కాలంలో చిన్న‌స్థాయిలో ఉన్న ఉద్యోగులను కొంత మంది చిన్న చూపు చూడ‌డం ఎక్కువైంది. త‌మ ద‌గ్గ‌ర ప‌నిచేసే వారిని కొంద‌రు బానిస‌లుగా చూస్తున్నారు. మ‌నుషులు అన్న త‌రువాత త‌ప్పులు స‌హ‌జం. చిన్న చిన్న త‌ప్పుల‌కు మంద‌లించి వ‌దిలివేయాలి గాని చేయిచేసుకోవ‌డం అనాగ‌రికం. లిఫ్ట్‌లో ఓ వ్య‌క్తి ఇరుక్కుపోతే.. గ‌మ‌నించిన వాచ్‌మెన్ అత‌డిని ర‌క్షించాడు. ఇందుకు కృత‌జ్ఞ‌త‌లు చెప్పాల్సింది పోయి.. ఎందుకు ఆల‌స్యం, ఇదేనా మీ ప‌ని అంటూ ఆగ్ర‌హంతో ఊగిపోతూ వాచ్‌మెన్ పై చేయి చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఈ ఘ‌ట‌న గురుగ్రామ్ లో చోటు చేసుకుంది.

ద క్లోజ్ నార్త్ సొసైటీలో వరుణ్ నాథ్ అనే వ్య‌క్తి నివాసం ఉంటున్నాడు. సోమ‌వారం ఉద‌యం 14వ అంత‌స్తు నుంచి లిఫ్ట్‌లో కింద‌కు వ‌స్తుండ‌గా.. లిఫ్ట్ ఆగిపోయింది. వెంట‌నే ఇంట‌ర్‌కామ్ ద్వారా సెక్యూరిటీ సిబ్బందికి స‌మాచారం ఇచ్చాడు. అప్ర‌మ‌త్త‌మైన సెక్యూరిటీ గార్డు అశోక్ త‌న‌తో పాటు లిఫ్ట్ మ్యాన్‌ను తీసుకువ‌చ్చాడు. ఇద్ద‌రు క‌లిసి లిప్ట్‌లో ఉన్న వ‌రుణ్‌ను సుర‌క్షితంగా బ‌య‌ట‌కు తీసుకువ‌చ్చారు.

త‌న‌ను బ‌య‌ట‌కు తీసుకువ‌చ్చినందుకు వారికి థ్యాంకు చెప్పాల్సిన వ‌రుణ్‌.. ఇంత ఆల‌స్యం ఎందుకు చేశారంటూ ఆగ్ర‌హంతో బ‌య‌ట‌కు రాగానే సెక్యూరిటీ గార్డును చెంప‌దెబ్బ‌లు కొట్టాడు. అంతేకాకుండా లిఫ్ట్‌మ్యాన్‌ని కూడా గ‌ట్టిగా కొట్టాడు. ఈ ఘ‌ట‌న మొత్తం అక్క‌డి సీసీ కెమెరాల్లో రికార్డైంది. ఆగ్ర‌హించిన అపార్ట్‌మెంట్ గార్డులు వ‌రుణ్‌నాథ్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. పోలీసుల‌కు సైతం ఫిర్యాదు చేశారు. కేసు న‌మోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Next Story