ఉత్తరప్రదేశ్‌లోని ఓ రైల్వే క్రాసింగ్ వద్ద టెడ్డీ బేర్ దుస్తుల్లో డ్యాన్స్ చేసిన వ్యక్తిని రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్‌పీఎఫ్) అరెస్టు చేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. షాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కుందాఘాట్ నివాసి అయిన అతడిపై రైల్వే చట్టం 145 (న్యూసెన్స్) కింద కేసు నమోదు చేశారు. అరెస్టయిన వ్యక్తిని సునీల్ కుమార్ (22)గా గుర్తించారు. అతని యూట్యూబ్ ఛానెల్, 'టెడ్డీ గాడ్‌ఫాదర్' అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో అతనికి 1,600 మంది ఫాలోవర్లు ఉన్నారు.
రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం సాయంత్రం ఓ రైల్వే క్రాసింగ్ దగ్గర ఎక్స్‌ప్రెస్, సరుకు రవాణా రైళ్లు వెళుతుండగా సునీల్ కుమార్ క్రాసింగ్‌ను దాటి రైలు పట్టాలపై డ్యాన్స్ చేశాడు. క్రాసింగ్‌కు ఇవతలి వైపు ఉన్న కొందరు అతడి డ్యాన్స్ వీడియోను తీసి సోషల్ మీడియాలో పెట్టారు. ఈశాన్య రైల్వే సీనియర్ కమాండెంట్ చంద్ర మోహన్ మిశ్రా మాట్లాడుతూ.. ''సునీల్ రైల్వే నిబంధనలను ఉల్లంఘించడమే కాకుండా తన ప్రాణాలను కూడా పణంగా పెట్టాడు. గోరఖ్‌పూర్ కాంట్ రైల్వే స్టేషన్ ఆర్‌పిఎఫ్ పోస్ట్ సబ్-ఇన్‌స్పెక్టర్ దీపక్ అతన్ని అరెస్టు చేశారు'' అని చెప్పారు.
పిల్లల పుట్టినరోజు వేడుకలు, ఫెయిర్లు, పబ్లిక్ పార్కులలో టెడ్డీ బేర్ దుస్తుల్లో డ్యాన్స్ చేస్తూ జీవనోపాధి పొందుతున్నట్లు సునీల్ కుమార్ చెప్పాడు.