కోతులతో సెల్ఫీ.. లోయలో పడి వ్యక్తి మృతి
Man falls into gorge while taking selfie with monkeys.కోతులతో సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించి
By తోట వంశీ కుమార్
ప్రస్తుతం సెల్ఫీల ట్రెండ్ నడుస్తోంది. చేతిలో స్మార్ట్‌ఫోన్ ఉంటే చాలు యువత ఎక్కడపడితే అక్కడ సెల్ఫీలు తీసుకోవడాన్ని అమితంగా ఇష్టపడుతోంది. ఈ సెల్ఫీల పిచ్చి రోజు రోజుకు ముదురుతోంది. కొన్నిసార్లు సెల్ఫీల మోజులో పడి ప్రాణాలు కోల్పోతున్నారు. అయినప్పటికీ కొందరిలో మార్పు రావడం లేదు. సెల్ఫీలు తీసుకోవడం తప్పు అని అనడం లేదు గానీ.. తీసుకునేటప్పుడు మనం ఎక్కడ ఉన్నాం. చుట్టు పక్కల ఏమున్నాయే విషయాలని గమనించి తీసుకోవాలి. అప్పుడే ప్రమాదాల బారిన పడకుండా ఉంటాం. ఓ వ్యక్తి కోతులతో సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించి లోయలో పడి చనిపోయాడు. ఈ ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది.
39 ఏళ్ల అబ్దుల్ షేక్ అనే వ్యక్తి పుణె జిల్లా భోర్ నుంచి కొంకణ్ కు తన కారులో వెలుతున్నాడు. వరందా ఘాట్ రోడ్‌లో ఉన్న వాఘ్‌జాయ్ గుడి వద్ద కారును ఆపాడు. చుట్టూ కోతులు ఉండడంతో వాటితో కలిసి సెల్ఫీ దిగాలని అతడు బావించాడు. వెంటనే జేబులోంచి సెల్‌ఫోన్ తీశాడు. కెమెరా ఆన్ చేసి సెల్ఫీ దిగేందుకు యత్నించాడు. కోతుల గుంపుతో పాటు తనను కవర్ చేసుకోవాలని ప్రయత్నించి కొండ పై నుంచి జారీ లోయలో పడిపోయాడు.
సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకున్నారు. స్థానిక సహ్యాద్రి రెస్క్యూ గ్రూప్ సహాయంతో పోలీసులు అతడి మృతదేహాన్ని బయటకు తీశారు. మంగళవారం సాయంత్రం ఈ ఘటన జరుగగా బుధవారం అతడి మృతదేహాన్ని 500 అడుగుల లోయలోంచి బయటకు తీసుకువచ్చారు. అబ్దుల్ మృతి చెందడంతో అతడి కుటుంబంలో విషాదం నెలకొంది.