తమిళనాడులో ఘోరం.. వ్యక్తిని నడిరోడ్డుపై నరికి చంపేశారు..
తమిళనాడులో దారుణం చోటుచేసుకుంది. పట్టపగలు నడి రోడ్డుపై కొందరు దుండగులు వెంటాడి నరికి చంపారు. సీసీ కెమెరాల్లో..
By Srikanth Gundamalla Published on 18 Jun 2023 3:19 PM ISTతమిళనాడులో ఘోరం.. వ్యక్తిని నడిరోడ్డుపై నరికి చంపేశారు..
తమిళనాడులో దారుణం చోటుచేసుకుంది. పట్టపగలు నడి రోడ్డుపై కొందరు దుండగులు వెంటాడి నరికి చంపారు. స్థానికంగా ఉన్న సీసీ కెమెరాల్లో ఈ ఘోరమైన దృశ్యాలు రికార్డయ్యాయి. మృతుడికి ఓ హత్య కేసులో సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ దారుణ హత్యకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
తమిళనాడులోని కారైకుడి జిల్లాలో ఆదివారం రోజున ఈ సంఘటన జరిగింది. మధురైకి చెందిన అరివళగన్ అలియాస్ వినీత్ అనే వ్యక్తి ఓ హత్య కేసలో సంబంధం ఉంది. ఈ క్రమంలోనే అతన్ని పోలీసులు స్టేషన్‌కు పిలిచి సంతకం పెట్టాలని చెప్పారు. వినీత్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి సంతకం చేసి తిరిగి రోడ్డు మీదకు వచ్చాడు. అప్పుడు కొందరు కారులో వచ్చి వినీత్‌ను చుట్టుముట్టారు. వారి వద్ద కర్రలు, రాడ్లు, కత్తులు ఉన్నాయి. అయితే.. వినీత్ వారిని తప్పించుకునేందుకు తోసేసి పారిపోయే ప్రయత్నం చేశాడు. అలా కొద్ది దూరం పరిగెత్తగానే వినీత్‌కు అదుపుతప్పి కిందపడిపోయాడు. దీంతో.. దుండగులు అతన్ని చుట్టుముట్టి విపరీతంగా కొట్టారు. కత్తులతో నరికారు. అక్కడే ఉన్న ఓ వ్యక్తి వినీత్‌ను కాపాడే ప్రయత్నం చేశాడు కానీ.. ఫలితం లేకపోయింది. దుండగులు ఐదుగురు ఉండటంతో అతను వెనక్కి తగ్గాల్సి వచ్చింది.
ఇక వినీత్‌పై దాడి చేశాక ఐదుగురు దుండగులు కారులో అక్కడి నుంచి పారిపోయారు. వెంటనే స్పందించిన స్థానికులు అంబులెన్స్, పోలీసులకు కాల్ చేశారు. ఆ తర్వాత వినీత్‌ను ఆస్పత్రికి తరలించారు. అయితే.. దారి మధ్యలోనే వినీత్ చనిపోయినట్లు పోలీసులు చెప్పారు. పోలీసులు మృతుడి స్నేహితుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల కోసం గాలిస్తున్నారు. వినీత్ ప్రస్తుతం ఓ హత్య కేసులో షరతులతో కూడిన బెయిల్ బయటకు వచ్చినట్లు పోలీసులు తెలిపారు. ఇద్దరు స్నేహితులతో కలిసి ఓ లాడ్జిలోఓ ఉంటున్నట్లు చెప్పారు. నిందితులను పట్టుకుని విచారించాక పూర్తి వివరాలు చెబుతామని తమిళనాడు పోలీసులు తెలిపారు.