టీకా తీసుకోవ‌డం వ‌ల్లే నా కూతురు మృతి.. రూ.1000కోట్లు చెల్లించండి

Man Claims Daughter Died of COVID-19 Vaccine Side Effects.క‌రోనా మ‌హ‌మ్మారి నుంచి ర‌క్ష‌ణ పొందాలంటే టీకా ఒక్క‌టే

By తోట‌ వంశీ కుమార్‌  Published on  3 Feb 2022 8:38 AM IST
టీకా తీసుకోవ‌డం వ‌ల్లే నా కూతురు మృతి.. రూ.1000కోట్లు చెల్లించండి

క‌రోనా మ‌హ‌మ్మారి నుంచి ర‌క్ష‌ణ పొందాలంటే టీకా ఒక్క‌టే మార్గం అని నిపుణులు చెబుతున్న సంగ‌తి తెలిసిందే. అయితే.. క‌రోనా టీకా తీసుకోవ‌డంతోనే త‌న కూతురు ప్రాణాలు కోల్పోయింద‌ని ఔరంగాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి బాంబే హైకోర్టును ఆశ్ర‌యించారు. మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం, సీరం సంస్థ‌లు త‌న‌కు ప‌రిహారంగా రూ.1000 కోట్లు చెల్లించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ పిటిష‌న్‌లో కోరాడు.

ఈ కేసుకు పూర్వాపరాల్లోకి వెళ్తే.. ఔరంగాబాద్ చెందిన స్నేహాల్ నాసిక్‌లో వైద్య విద్యను అభ్యసిస్తోంది. జ‌న‌వ‌రి 28, 2021 ఆమె కొవిషీల్ట్ టీకా తీసుకుంది. ఆ త‌రువాత సైడ్ ఎఫెక్ట్స్ కార‌ణంగా మార్చి 1న ఆమె మ‌ర‌ణించిందని ఆమె తండ్రి లునావ‌త్ కోర్టును ఆశ్ర‌యించాడు. త‌న‌కు న్యాయం కావాల‌ని, ఎంతో మంది ప్రాణాలు కాపాడేందుకే ఈ పిటిష‌న్ దాఖ‌లు చేసిన‌ట్లు వివ‌రించాడు.

'క‌రోనా టీకా సుర‌క్షిత‌మ‌ని, ఎలాంటి హానీ ఉండ‌ద‌ని, ఆరోగ్య కార్య‌క‌ర్త‌లంతా టీకా తీసుకోవాల‌ని మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం చెప్ప‌డంతో.. అది నిజ‌మ‌ని న‌మ్మి వైద్య‌క‌ళాశాల‌లో చ‌దువుతున్న నా కుమారై టీకా తీసుకుంది. ఆమె ఆరోగ్య కార్య‌క‌ర్త‌గా కూడా సేవ‌లందించింది. జ‌న‌వ‌రి 28, 2021 టీకా తీసుకోగా.. ఆ త‌రువాత దుష్ఫ్ర‌భావాల కార‌ణంగా మార్చిన 1న నా కుమారై చ‌నిపోయింది. ఈ విష‌యాన్ని కేంద్ర ప్ర‌భుత్వం ఏర్పాటు చేసిన ఏఈఎఫ్ఐ క‌మిటీ గ‌తేడాది అక్టోబ‌ర్ 2న చెప్పిన‌ట్లు ' తెలిపారు. టీకా పూర్తి సురక్షితమని డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) కూడా చెప్పిందని గుర్తు చేశారు. త‌న‌కు న్యాయం చేయాల‌ని, న‌ష్ట‌ప‌రిహాంగా రూ.1000 కోట్ల చెల్లించాల్సిగా మహారాష్ట్ర ప్రభుత్వం, సీరం సంస్థలను ఆదేశించాలని పిటిష‌న్‌లో వివ‌రించారు. ఈ పిటిష‌న్‌ను ఆయ‌న గ‌త‌వార‌మే దాఖ‌లు చేయ‌గా. విచార‌ణ తేదీ ఇంకా ఖ‌రారు కాలేదు.

Next Story