సీటీ స్కాన్ చేయడంలో ఆలస్యం జరిగిందని డాక్టర్‌ని ఓ వ్యాపారి చెప్పుతో కొట్టాడు. దీంతో ఆ వ్యాపారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన ఒడిశాలోని సంబల్‌పూర్ పట్టణంలోని ఓ ప్రైవేట్ డయాగ్నస్టిక్ సెంటర్‌లో జరిగింది. ఘటనకు సంబంధించిన దృశ్యాలు డయాగ్నస్టిక్ సెంటర్‌లో అమర్చిన సీసీటీవీలో రికార్డు అయ్యాయి. తెలిసిన వివరాల ప్రకారం.. వృత్తిరీత్యా వ్యాపారి అయిన నిందితుడు నటాబర్ బంకా.. అతనికి చికిత్స చేస్తున్న వైద్యుడి సలహా మేరకు సీటీ స్కాన్ కోసం ఓ ప్రైవేట్ డయాగ్నస్టిక్ సెంటర్‌కు వెళ్లాడు.
అతను తన పరీక్షను త్వరగా నిర్వహించాలని రేడియాలజిస్ట్ మిశ్రాను సంప్రదించాడు. సీటీ స్కాన్‌కు రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించి క్యూలో నిరీక్షిస్తున్న నటబర్ గంటల తరబడి క్యూలో నిలబడాల్సి రావడంతో ఓపిక నశించి ఇతర ఆస్పత్రి సిబ్బంది సమక్షంలోనే డాక్టర్‌ని చెప్పుతో కొట్టాడు. సీసీటీవీ ఫుటేజీలో సదరు వ్యాపారి లేడీ నర్సుపై దాడి చేయడం కూడా కనిపించింది. దీంతో వైద్యుడు చిదానంద మిశ్రా పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వెంటనే రంగంలోకి దిగి సీసీటీవీ ఫుటేజీని పరిశీలించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.