Video: విషాదం.. చెల్లెలి మృతదేహాన్ని 5 కి.మీ మోసుకెళ్లిన అన్నలు

ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరీ జిల్లాలో బాధకరమైన ఘటన చోటు చేసుకుంది. టైఫాయిడ్‌ బారిన పడిన ఓ టీనేజీ బాలిక సకాలంలో వైద్య సహాయం అందకపోవడంతో ప్రాణాలు కోల్పోయింది.

By అంజి  Published on  12 July 2024 10:00 AM GMT
Typhoid, Lakhimpur Kheri,Uttarpradesh

Video: విషాదం.. చెల్లెలి మృతదేహాన్ని 5 కి.మీ మోసుకెళ్లిన అన్నలు 

ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరీ జిల్లాలో బాధకరమైన ఘటన చోటు చేసుకుంది. టైఫాయిడ్‌ బారిన పడిన ఓ టీనేజీ బాలిక సకాలంలో వైద్య సహాయం అందకపోవడంతో ప్రాణాలు కోల్పోయింది. దీంతో ఆమె మృతదేహాన్ని ఇద్దరు సోదరులు భుజంపై మోసుకుంటూ ఏకంగా 5 కిలోమీటర్లు నడిచారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

''ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరీ జిల్లా నుండి వచ్చిన వీడియో హృదయాన్ని కదిలించింది. శివాని టైఫాయిడ్‌తో బాధపడుతోంది. వరదల కారణంగా, ఆమెను మంచి వైద్యుడి వద్దకు తీసుకెళ్లలేకపోయారు. ఆమె సోదరుడు తన సోదరి మృతదేహాన్ని తన భుజంపై మోస్తున్నాడు'' అంటూ ఓ ఎక్స్‌ యూజర్‌ పోస్ట్‌ చేశాడు. వీడియోలో శివానిగా గుర్తించబడిన మృతురాలు రోడ్డుపై పడి ఉండగా, ఆమె సోదరుడు కొంతమంది శ్రేయోభిలాషులతో కలిసి ఆమెను ఎత్తడానికి ప్రయత్నిస్తున్నట్లు చూడవచ్చు.

లఖీంపూర్ ఖేరీ జిల్లాలోని పాలియాలో శివానీ అనే బాలిక తన ఇద్దరు సోదరులతో కలిసి నివసిస్తూ 12వ తరగతి చదువుతోంది. రెండు రోజుల కిందట శివానీ టైఫాయిడ్ బారినపడింది. ఆమెను సోదరులు స్థానిక వైద్యుడికి చూపించగా మెరుగైన చికిత్స కోసం పెద్ద ఆసుపత్రికి తరలించాలని సూచించారు. దీంతో ఆసుపత్రికి తీసుకెళ్తుండగానే దారిలో మరణించింది. ఈ క్రమంలోనే గత కొన్ని రోజులుగా ఈ ప్రాంతంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా రోడ్లు కొట్టుకుపోవడంతో కనెక్టివిటీ పెద్దగా దెబ్బతినడంతో సోదరుడు తన ఇంటి వరకు శివానిని తన భుజాలపై మోసుకెళ్లాల్సి వచ్చిందని నివేదికలు చెబుతున్నాయి.

Next Story