మధ్యప్రదేశ్‌లోని రేవా జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. 24 ఏళ్ల యువకుడిని.. తన 19 ఏళ్ల స్నేహితురాలు పెళ్లి చేసుకోమని అడిగినందుకు ఆమెను విచక్షణారహితంగా కొట్టాడు. దీంతో ఆ యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. పంకజ్ త్రిపాఠి అనే వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. బుధవారం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. సబ్ డివిజనల్ ఆఫీసర్ ఆఫ్ పోలీస్ నవీన్ దూబే తెలిపిన వివరాల ప్రకారం.. ''వీడియోలో ఉన్న వ్యక్తి మౌగంజ్ ప్రాంతంలోని ధేరా గ్రామ నివాసి'' అని చెప్పారు.
నిందితుడు, బాలిక సంబంధం కలిగి ఉన్నారని, వారి మధ్య వాగ్వాదం జరగడంతో ఆ వ్యక్తి ఆమెను కొట్టాడని దూబే తెలిపారు. వీడియోలో.. 19 ఏళ్ల అమ్మాయి తనను పెళ్లి చేసుకోవాలని నిందితుడిని కోరడం కనిపించింది. అతడు మొదట్లో చిరాకు పడ్డాడు. ఆ తర్వాత ఆమె ముఖంపై పదే పదే తన్నడం, కొట్టడం జరిగింది. నిందితుడిని మొదట IPC సెక్షన్ 151 (ప్రజా శాంతికి విఘాతం కలిగించడం) కింద అదుపులోకి తీసుకున్నారు. బాలిక ఫిర్యాదు చేయడానికి నిరాకరించడంతో విడుదల చేశారు.
అయితే దాడికి సంబంధించిన వీడియో బయటకు రావడంతో నిందితుడిపై భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 323 (స్వచ్ఛందంగా గాయపరచడం), ఇతర సంబంధిత నిబంధనల కింద కేసు నమోదు చేయబడింది. 19 ఏళ్ల బాధితురాలు వీడియోను చిత్రీకరించిన, వైరల్ చేసిన వ్యక్తిపై ఫిర్యాదు చేసింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటి) చట్టం కింద కేసు నమోదు చేసినట్లు అధికారి తెలిపారు.