దాడి జరిగిందా..? లేక డ్రామానా..?

Mamata Incident. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై నందిగ్రామ్ లో దాడి జ‌రిగింది. ప్ర‌స్తుతం ఆమె ఆసుప‌త్రిలో చికిత్స తీసుకుంటున్నారు

By Medi Samrat  Published on  11 March 2021 6:49 PM IST
Mamata Incident

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై నందిగ్రామ్ లో దాడి జ‌రిగింది. ప్ర‌స్తుతం ఆమె ఆసుప‌త్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఆమె ఆరోగ్య ప‌రిస్థితిపై వైద్యులు హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేశారు. ఆమె ఎడమకాలితో పాటు కుడిభుజం, మెడకు తీవ్ర గాయాలయ్యాయని వైద్యులు చెప్పారు. ఆమె ఛాతీనొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నార‌ని చెప్పారు. రెండు రోజుల పాటు ఆమె వైద్యుల పర్యవేక్షణలో వుండాలని, ఆమెకు మరో రెండు నెలల విశ్రాంతి అవసరమని వివరించారు. మ‌మ‌త‌ ఆరోగ్య పరిస్థితిపై టీఎంసీ నాయకులు ఈసీని కలవనున్నారు. ఇప్ప‌టికే ఆమెపై దాడి ఘటనను సీరియస్‌గా తీసుకున్న ఈసీ ఈ ఘ‌ట‌న‌పై ప‌శ్చిమ బెంగాల్ డీజీపీ రేపటిలోగా సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. ఆమె కాలికి గాయం అయింద‌ని తెలుపుతూ ఆమె కాలికి పెద్ద క‌ట్టుక‌ట్టి ఉన్న ఫొటోను వైర‌ల్ చేస్తున్నారు. ఎన్నిక‌ల నేప‌థ్యంలో ప్ర‌చారం, ఓట‌ర్ల సానుభూతి పొందడం కోస‌మే ఆమె ఇటువంటి గిమ్మిక్కులు చేస్తున్నార‌ని ప్ర‌తిప‌క్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి.

మ‌మ‌తపై దాడి జ‌రిగిన స‌మ‌యంలో అక్కడ ఉన్న కొంద‌రు ప్ర‌త్య‌క్ష సాక్షులు మాత్రం అస‌లు ఆమెకు అక్క‌డ ఏమీ కాలేద‌ని చెబుతున్నారు. స్థానిక‌ విద్యార్థి సుమ‌న్ మైతీ మీడియాతో మాట్లాడుతూ ముఖ్య‌మంత్రి కారులో ఇక్క‌డ‌కు వ‌చ్చిన స‌మ‌యంలో చాలా మంది ఆమె చుట్టూ చేరారని అన్నాడు. మ‌మ‌తను ఎవ‌రూ తోయ‌లేద‌ని, అయితే, ఆమె మెడ, కాలికి గాయం అయిన‌ట్లు అనంత‌రం తెలిసింద‌ని, ఆ స‌మ‌యంలో ఆమె కారు మెల్లిగా క‌దులుతూ ముందుకు వెళ్ల‌డాన్ని చూశాన‌ని చెప్పాడు. ఆ స‌మ‌యంలో అక్క‌డే ఉన్నాను. ఆమె కారులోనే కూర్చుని ఉన్నారు. కారు త‌లుపు తెరుచుకుని ఉంది. ఆ త‌లుపు ఓ పోస్ట‌ర్ కు త‌గ‌ల‌గానే దాన్ని మూసేశారు. ఆమెను ఎవ్వ‌రూ తోసేయ‌లేదు, కొట్టలేదు. ఆ కారు త‌లుపు వ‌ద్ద ఆ స‌మ‌యంలో ఎవ్వ‌రూ లేరని పలువురు చెప్పిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉన్నాయి.

'మమతపై జరిగింది నిజమైన దాడా... లేక స్క్రిప్ట్ ప్రకారం జరిగిన డ్రామా అన్నది చూడాలి. రాష్ట్ర ప్రజలు ఇంతకుముందు కూడా ఇలాంటి డ్రామాలు చాలానే చూశారు.ఓట్ల కోసం వారు ఏ స్థాయికైనా దిగజారుతారు...' అని బెంగాల్ బీజేపీ చీఫ్ దిలీప్ ఘోష్ విమర్శించారు. ఎన్నికల్లో ఓడిపోతామన్న ఆందోళన,భయంతోనే మమతా బెనర్జీ దాడి పేరుతో డ్రామాలు ఆడుతున్నారని బీజేపీ ఇప్పటికే విమర్శలను ఎక్కుపెట్టింది. మమతా బెనర్జీపై దాడి జరిగిందని ఒక్క ప్రత్యక్ష సాక్షి కూడా ధ్రువీకరించలేదని.. మమతా చేస్తున్నదంతా నందిగ్రామ్ ప్రజలు గమనిస్తున్నారని అంటున్నారు.


Next Story